ఇటీవల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా ఎన్నికైన మాజీ క్రికెటర్ అజహరుద్దీన్.. మరో ఘనత అందుకోనున్నాడు. రేపు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానంలో అతడి పేరిట ఏర్పాటు చేసిన స్టాండ్‌ను ప్రారంభించనున్నారు హెచ్‌సీఏ అధికారులు. భారత్-వెస్టిండీస్ మధ్య తొలి టీ20 ఇక్కడే జరగనుంది. ఇప్పటికే ఈ మైదానంలో వీవీఎస్ లక్ష్మణ్, ఎన్. శివలాల్ యాదవ్ పేర్లతో పెవిలియన్లు ఉన్నాయి.
19 ఏళ్ల తర్వాత...
టీమిండియాకు మాజీ కెప్టెన్‌గా పనిచేసిన మహ్మద్ అజహరుద్దీన్.. 2000లో మ్యాచ్ ఫిక్సింగ్ అభియోగాలతో కెరీర్ అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. ఇటీవల 19 ఏళ్ల తర్వాత మళ్లీ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు. ఆటగాడిగా కాకుండా పాలకుడిగా వచ్చాడు. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) నూతన అధ్యక్షుడిగా అజ్జూ ఎన్నికయ్యాడు. 147 ఓట్లు సాధించిన అజ్జూ.. 74 ఓట్ల ఆధిక్యంతో ప్రత్యర్థి ప్రకాశ్‌చంద్ జైన్ (73)పై గెలిచాడు. అందుబాటులో ఉన్న ఆరు పదవులనూ అజహరుద్దీన్ ప్యానెల్ క్లీన్‌స్వీప్ చేసింది.
పట్టుబట్టి సాధించాడు..
1984-85 సీజన్లో అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించిన అజహర్.. తొలి మూడు టెస్టుల్లో శతకాలు బాది భారత క్రికెట్లో తన పేరు మార్మోగేలా చేశాడు. ఆ తర్వాత కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. మేటి బ్యాట్స్‌మన్‌గా, ఆపై గొప్ప కెప్టెన్‌గా పేరు సంపాదించాడు.
99 టెస్టులు, 334 వన్డేలాడిన అజహర్.. 2000లో అనూహ్య రీతిలో క్రికెట్ నుంచి నిష్క్రమించాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో అప్రతిష్ట మూటగట్టుకున్నాడు. సీబీఐ విచారణలో దోషిగా తేలడం వల్ల అజహర్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. అయితే 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అజ్జూపై నిషేధం చట్ట వ్యతిరేకమని తీర్పునిచ్చింది.
బీసీసీఐ నిషేధాన్ని ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించలేదు కానీ.. కోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్లకపోవడం వల్ల సందిగ్ధత నెలకొంది. అజ్జూ నిషేధంలో ఉన్నాడో లేదో బీసీసీఐ స్పష్టత ఇవ్వని నేపథ్యంలో.. 2017లో హెచ్‌సీఏ అధ్యక్ష పదవి కోసం అతను వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఎన్నికల రోజు అజ్జూను ఉప్పల్ స్టేడియం గేటు లోపలికి కూడా అనుమతించలేదు.
ఈ ఏడాది ప్రయత్నం...
ఆశలు వదులుకోకుండా ఈ ఏడాది ఎన్నికల సందర్భంగా అధ్యక్ష పదవికి రేసులో నిలిచాడు అజ్జూ. గతంలో తనకు అడ్డుగా నిలిచిన వివేకానంద్‌కు వ్యతిరేకంగా హెచ్‌సీఏ పెద్దల్ని ఏకం చేయగలిగాడు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల అభియోగంతో వివేక్‌పై వేటు పడటం వల్ల అజహర్‌కు మార్గం సుగమమైంది. హెచ్‌సీఏలో తనకు ఒక్క క్లబ్ కూడా లేకపోయినా.. పెద్ద స్థాయిలో మద్దతు కూడగట్టి ఎన్నికల్లో భారీ విజయం సాధించాడు.