ప్రపంచకప్ సెమీఫైనల్లో ఓడిన టీమిండియా వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనకు నేడు ఆటగాళ్లను ప్రకటించనుంది ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ. ఎవరికి విశ్రాంతినిస్తారు.. యువ ఆటగాళ్లకు అవకాశం దక్కుతుందా అనే విషయాలపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించే వీలుంది. వీరితో పాటు గతకొంత కాలంగా దేశవాళీ టోర్నీల్లో రాణిస్తున్న ప్రియాంక్ పంచల్, అభిమన్యు ఈశ్వరన్, నవదీపై సైనీ, రాహుల్ చాహర్, కేఎస్ భరత్ వంటి యువ క్రికెటర్ల పేర్లను సైతం సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ధావన్ ఉంటాడా?
ప్రపంచకప్‌లో గాయం కారణంగా వైదొలిగిన ధావన్ ఫిట్‌నెస్‌పై ఇంకా అనుమానాలున్నాయి. కొద్ది రోజుల క్రితం మళ్లీ బ్యాట్ పట్టిన ఈ ఆటగాడికి జట్టులో చోటు దక్కుతుందో లేదో చూడాలి. శిఖర్ స్థానంలో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ పేర్లు వినిపిస్తున్నాయి. ధోనీ స్థానంలో పంత్‌కు స్థానం లభించడం ఖాయంగా కనిపిస్తోంది.
సైనీకు, రాహుల్ చాహల్‌లకు చోటు లభిస్తుందా..?
మంచి వేగంతో పాటు కచ్చితత్వంలో బౌలింగ్ చేయగల నవీదీప్ సైనీకి అవకాశం ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచకప్ సమయంలో నెట్ బౌలర్‌గా కొనసాగాడు. స్పిన్ విభాగంలో కుల్దీప్, చాహల్ వరల్డ్‌కప్‌లో ఆశించినంతగా రాణించలేకపోయారు. వీరికి ప్రత్యామ్నాయంగా యజువేంద్ర చాహల్ పేరు వినిపిస్తోంది.
ఆగస్టు 3న టీమిండియా విండీస్ పర్యటన ఆరంభం కానుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. తొలుత టీ20 సిరీస్ జరగనుంది.
ఇవీ చూడండి.. అంతర్జాతీయ క్రికెట్లో ఓవర్‌త్రోలపై సమీక్ష