బీసీసీఐ అధ్యక్షుడు, భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీకి గుండెపోటు వచ్చింది. కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్ ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. స్వల్ప స్థాయి గుండెపోటు రావడం వల్ల 48 ఏళ్ల దాదా శనివారం ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, క్రిటికల్ కేరింగ్ యూనిట్ (సీసీయూ)లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వెల్లడించారు.
"గంగూలీకి స్వల్పస్థాయి గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. అయితే ఆయనకు కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంది. యాంజియోప్లాస్టీ అవసరమా లేదా? స్టంట్ వేయాలా వద్దా అనేది పరిశీలిస్తున్నాం" అని చికిత్స అందిస్తున్న డా.సరోజ్ తెలిపారు.
శుక్రవారం సాయంత్రం గంగూలీ వ్యాయామం చేస్తుండగా ఛాతిలో నొప్పితో అసౌకర్యానికి గురయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం కూడా ఆయన ఇబ్బంది పడటం వల్ల కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రిలో చేర్చారు.
- మధ్యాహ్నం ఒంటి గంటకు వుడ్‌ల్యాండ్ ఆస్పత్రిలో చేరిన గంగూలీ.
- ఆయన చికిత్స కోసం డా.సరోజ్ మండల్‌తో కూడిన ముగ్గురు వైద్యబృందం ఏర్పాటు
- ఆయన పల్స్ 70/ని, బీపీ 130/80తో పాటు మిగిలిన అన్ని పారమీటర్స్ నార్మల్‌గానే ఉన్నాయి.
- ఆస్పత్రి వర్గాల సమాచారం ప్రకారం ఆయనకు చేసిన ఈసీజీలో ఇన్ఫీరియర్ లీడ్స్, లాటరల్ లీడ్స్‌లో హైపర్‌క్యూట్ ఎస్టీ ఎలివేషన్ కనిపించింది.