తాను మంచి ఫిట్నెస్, ఫామ్‌తో ఉన్నానని అనుకుంటే, ఆటను ఆస్వాదిస్తున్నంత కాలం ధోనీ క్రికెట్లో కొనసాగాలని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు.
![Gambhir](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/official-status-as-a-former-cricketer-hasnt-sunk-in-completely-gautam-gambhir_2607newsroom_1595726359_600.webp)
"వయసు ఓ సంఖ్య మాత్రమే. ఆటగాడు ఫామ్‌లో ఉండటం, బంతిని బాగా కొడుతుండటం ముఖ్యం. ధోనీ బంతిని బాగా కొడుతున్నట్లయితే, ఫామ్‌లో ఉంటే, ఆటను ఆస్వాదిస్తుంటే, ఆరు లేదా ఏడో నంబరులో దిగి ఇప్పటికీ మ్యాచ్‌లు గెలిపించగలనని భావిస్తున్నట్లయితే క్రికెట్లో కొనసాగాలి. మంచి ఫిట్నెస్, ఫామ్ ఉంటే మహీ ఇంకా ఆడొచ్చు. రిటైర్మెంట్ విషయమై ఎవరూ ఎవరినీ ఒత్తిడి చేయలేరు"
-గౌతమ్ గంభీర్, భారత మాజీ క్రికెటర్
గతేడాది ప్రపంచకప్‌లో చివరగా ఆడిన టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ.. అనంతరం తాత్కాలిక విరామం ప్రకటించాడు. దీంతో మహీ రిటైర్మెంట్ తీసుకోనున్నాడని ఊహాగానాలు వచ్చాయి. కానీ వేటిపైనా అతడు స్పందించలేదు. ఈ ఏడాది ఐపీఎల్ దిగి, టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోవాలని ధోనీ భావించాడు. కరోనా వాటిని చెడగొట్టేసింది. దీంతో అతడి భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.
![Gambhir on MSD](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gg_2607newsroom_1595726359_892.jpg)