పరిమిత ఓవర్ల క్రికెట్లో కీలక పాత్ర పోషిస్తున్న తాను.. వెన్ను సమస్య వేధించే అవకాశమున్న నేపథ్యంలో టెస్టు క్రికెట్ ఆడేందుకు కాస్త ఆలోచిస్తున్నాడు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య. ఈ యువ క్రికెటర్ 2018 సెప్టెంబరు తర్వాత టెస్టు మ్యాచ్ ఆడలేదు. మొత్తంగా 11 టెస్టులే ఆడిన అతడు.. భారీ షాట్లు ఆడే ఆల్‌రౌండర్‌గా పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో తన స్థానాన్ని సుస్థిరపరుచుకున్నాడు. నిరుడు వెన్ను గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న హార్దిక్.. ప్రస్తుతం కోలుకుంటున్నాడు.
"నన్ను నేను బ్యాకప్ సీమర్‌గా పరిగణించుకుంటా. టెస్టు క్రికెట్ ఆడడం సవాలు కాబోతోందని వెన్నుకు శస్త్రచికిత్స జరిగినప్పుడు నాకు తెలియదు. నేను టెస్టు క్రికెటర్‌నై, పరిమిత ఓవర్ల క్రికెట్లో లేకపోతే.. వెన్నుకు ఇబ్బంది కలిగే అవకాశమున్నా టెస్టులు ఆడేవాణ్ని. కానీ తెల్ల బంతి క్రికెట్లో నా ప్రాధాన్యతేంటో నాకు తెలుసు. టెస్టు క్రికెట్ ఆడిన తర్వాత వన్డే, టీ20ల్లో నేను రాణించలేకపోయిన సందర్భముంది"
-- హార్దిక్ పాండ్య
.
కెరీర్ ముగిసిందనుకున్నా
2018 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్ సందర్భంగా గాయమైంది. స్ట్రెచర్‌పై క్రికెటర్లను తీసుకెళ్లడం అప్పటివరకు నేను చూడలేదు. ఆ గాయంతో నా కెరీరే ముగిసిపోయిందనుకున్నా. నొప్పితో తీవ్రంగా బాధపడ్డా. ఆసియాకప్ ముగిశాక విశ్రాంతి తీసుకోవాల్సింది. కానీ అంతలోనే గాయమైంది.
పాఠాలు నేర్చుకున్నా..
నిరుడు టీవీ షో వివాదం తర్వాత మరింత తెలివిగా వ్యవహరిస్తున్నా. జీవితంలో నేను తప్పులు చేశా. వాటిని అంగీకరించా. వాటిని ఒప్పుకొని ఉండకపోతే మరో టీవీ షోలో వచ్చే వాడినేమో. అయితే ఆ దశ ఇక నన్నెంత మాత్రం బాధించదు. కుటుంబంగా మేమంతా దాన్ని ఆమోదించాం. అయితే నా చర్యల వల్ల నా కుటుంబం సమస్యలు ఎదుర్కోవడం నన్నెంతో వేదనకు గురి చేసింది.
పాంటింగ్ తండ్రిలా..
2015లో రికీ పాంటింగ్ (అప్పటి ముంబయి ఇండియన్స్ కోచ్) నన్నెంతో బాగా చూసుకున్నాడు. అతడు నాకు తండ్రిలాంటి వాడని అనిపించింది. రికీ నుంచి ఎంతో నేర్చుకున్నా. పరిస్థితులను, మనసులను ఎలా అర్థం చేసుకోవాలో చెప్పాడు. బ్యాటింగ్‌కు వెళ్లే ముందు నాదగ్గరికి వచ్చి కూర్చునేవాడు. నేను బౌండరీ తాడు వద్ద ఉండి రికీని పిలిచేవాణ్ని. అతడు వచ్చి ఏం జరుగుతుందో వివరించేవాడు. అతడు చెప్పే విషయాన్ని నేను బాగా గ్రహించేవాణ్ని. త్వరగా నేర్చుకునేవాణ్ని.
వాళ్లు స్వేచ్ఛనిచ్చారు..
కోహ్లీ, రోహిత్ లేదా రవిశాస్త్రి సర్ ఆటగాడి దగ్గరికి వచ్చి ఆటను నేర్పరు. వాళ్లు నాకెంతో స్వేచ్ఛను ఇచ్చారు. నాకు భద్రతాభావాన్ని కలిగించారు. మనస్ఫూర్తిగా వాళ్లిచ్చిన మద్దతు నాకెంతో ఉపయోగపడింది. అందువల్లే సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టా. రాహుల్ ద్రవిడ్ (ఎన్‌సీఏ డైరెక్టర్) నన్ను నన్నుగా ఆమోదించాడు. క్రికెటర్‌గా నన్ను ఎల్లప్పుడూ గౌరవించాడు. పని పట్ల నాకున్న శ్రద్ధను అతడు ఇష్టపడ్డాడు.