.
నిత్యం నేర్చుకొంటూ తనకు తాను మరింత మెరుగవుతూ వారసత్వాన్ని వదిలివెళ్లటమే తన ధ్యేయమని టీమ్‌ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ 417 వికెట్ల రికార్డు బద్దలు కొట్టడంపై తనకు దృష్టి లేదని పేర్కొన్నాడు. రోహిత్ అద్భుతంగా ఆడుతున్నాడని, ఏనాటికైనా టీమ్‌ఇండియా ప్రపంచకప్ అందిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. కెరీర్లో ఎనిమిదో సారి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికైన యాష్ సిరీస్ విజయం తర్వాత మాట్లాడాడు.
"నిజాయతీగా చెబుతున్నా. భజ్జీ రికార్డు బద్దలు కొట్టడమన్న ఆలోచనే నాకు రాలేదు. ఆయనో అద్భుతమైన బౌలర్. ఆయన్నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. భజ్జీ టీమ్‌ఇండియాకు ఆడుతున్నప్పుడు నేను ఆఫ్‌స్పిన్నరే కాదు. 2001 సిరీసులో 32 వికెట్ల ప్రదర్శనతో అతడు ప్రేరణగా నిలిచాడు. నేను ఆఫ్ స్పిన్నర్ అవుతానని అప్పటికి అనుకోనేలేదు. భజ్జీ, కుంబ్లేతో కలిసి ఆడటం నా అదృష్టం. అయితే నేను నా వారసత్వం వదిలి వెళ్లాలని అనుకుంటున్నా" అని యాష్ చెప్పాడు.
"భారత జట్టు అద్భుతమైందని చెప్పేందుకు ఈ సిరీస్ విజయమే ఉదాహరణ. ఇదే నేను చెప్పాలనుకుంటున్నా. పిచ్‌ల గురించి గావస్కర్ చెప్పిందాట్లో అర్థముందనిపించింది" అని యాష్ అన్నాడు. భారత్ పిచ్‌లను పదేపదే విమర్శించే బ్రిటిష్ పండితుల మాటలను అతిగా పట్టించుకోవద్దని సన్నీ ఇంతకు ముందే చెప్పాడు. వారి మాటలకు విలువిస్తున్న కొద్దీ ఇలాగే వ్యాఖ్యానిస్తుంటారని అశ్విన్ సైతం అంటున్నాడు.
వీరేంద్ర సెహ్వాగ్ పాత్రను రోహిత్ పోషిస్తున్నాడా అని ప్రశ్నించగా 'కచ్చితంగా, సెహ్వాగ్ పాత్రను అతడు పోషిస్తున్నాడు. అతడు తనకిష్టమైన పనే చేస్తున్నాను. రోహిత్ ప్రత్యేకమైన ఆటగాడు. అతడు చేయాల్సిన పనే చేస్తున్నాడని గుర్తించేందుకు పెద్దగా సమయం పట్టదు. అతడు భారత్‌కు ప్రపంచకప్ గెలిపిస్తాడని నా నమ్మకం' అని అశ్విన్ వెల్లడించాడు.