వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో తాను చెన్నై సూపర్‌కింగ్స్‌కే ఆడతానని సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పష్టం చేశాడు. బ్రిటన్‌లో జరగనున్న 'ద హండ్రెడ్' లీగ్ డ్రాఫ్ట్ నుంచి తన పేరును ఉపసంహరించుకోనున్నట్లు తెలిపాడు. ఈ డ్రాఫ్ట్‌లో తన పేరు ఉండడం చర్చనీయాంశమైన నేపథ్యంలో భజ్జీ స్పందించాడు.
" ఐపీఎల్, చెన్నై సూపర్‌కింగ్స్‌కే నా తొలి ప్రాధాన్యత. చెన్నై తరఫున రెండు మంచి సీజన్లు ఆడా. ఆ రెండు సార్లు మేం ఫైనల్‌కు వెళ్లాం. ఇప్పుడు మూడో సీజన్‌పై దృష్టిపెట్టా. బీసీసీఐ నిబంధనలను నేను గౌరవిస్తా. నేనెప్పుడూ నిబంధనలను ఉల్లంఘించలేదు. డ్రాఫ్ట్ నుంచి నా పేరును ఉపసంహరించుకుంటా. అయితే హండ్రెడ్ లీగ్ మంచి టోర్నీగానే భావిస్తున్నా".
-- హర్భజన్ సింగ్, భారత క్రికెటర్
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించని భజ్జీ... 2020లో నిర్వహించే హండ్రెడ్ లీగ్‌లో ఆడేందుకు తన కనీస ధరను లక్ష పౌండ్లుగా నిర్ణయించాడు. అయితే ఇందులో ఆడేందుకు బీసీసీఐ నిబంధనలు అనుమతించలేదు. డ్రాఫ్ట్‌లో పేరు రాగానే భారత క్రికెట్ బోర్డు ఘాటుగానే స్పందించింది. ఆటగాడు రాజీనామా చేయకుండా ఆడే నిర్ణయం తీసుకుంటే చర్యలు తప్పవని హర్భజన్‌ను పరోక్షంగా హెచ్చరించింది. బోర్డు ఆదేశాలకు తలొగ్గిన భజ్జీ తన నిర్ణయం మార్చుకున్నాడు.
2016 ఆసియాకప్‌లో చివరిసారి ఆడిన భజ్జీ తర్వాత జాతీయ జట్టులో అవకాశాలు పొందలేకపోయాడు. గత రెండేళ్లుగా ఐపీఎల్‌లోనే ఆడుతున్న హర్భజన్... ఈ ఏడాది 16 వికెట్లు తీశాడు. మొత్తం 150 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా తరఫున అత్యధికంగా టెస్టుల్లో 417 వికెట్లు తీసిన హర్భజన్... వన్డేల్లో 260 వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా నిలిచాడు.
100 బంతుల ఆట...
'ది హండ్రెడ్' అనేది వంద బంతుల క్రికెట్ లీగ్. ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ఈ టోర్నీని నిర్వహిస్తోంది. 2020 జులైలో ఈ టోర్నీ తొలి సీజన్ ఆరంభంకానుంది. ఈ లీగ్‌లో మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు పాల్గొంటుండగా, ప్రతీ జట్టుకు ముగ్గురు మాత్రమే విదేశీ ఆటగాళ్లను అనుమతించారు.