ఆస్ట్రేలియా ఆటగాళ్లపై టీమ్‌ఇండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఎప్పుడూ ఆధిపత్యం చెలాయించేవాడు. 2001 నుంచీ అతడికది అలవాటుగా మారింది. తన వైవిధ్యమైన దూస్రాలతో వారిని కంగారు పెట్టించేవాడు. అలాంటి దిగ్గజం తనని ఔట్ చేసినప్పుడల్లా టీమ్‌ఇండియా ఫీల్డర్లు ఏదో అనేవారని ఆ జట్టు మాజీ కీపర్, బ్యాట్స్‌మన్ ఆడం గిల్‌క్రిస్ట్ చెప్పాడు.
"భారత్‌తో ఆడేటప్పుడు నేను పరుగులు చేస్తుంటే టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఏమనేవారు కాదు. కానీ.. భజ్జీ బౌలింగ్‌లో ఔటయితే మాత్రం ఎప్పుడూ ఒక మాట అంటుండేవారు. ఆ మాటేంటో నాకు తెలియదు. అది పలకడం కూడా నాకు రాదు. నేను భారత్‌లో పర్యటించేటప్పుడు మంచి ఆతిథ్యం లభిస్తుండేది. ఒకసారి ముంబయిలో ఉదయాన్నే లేచి ఎవరూ గుర్తు పట్టకుండా గాగుల్స్, టోపీ, ఇయర్‌ఫోన్స్ పెట్టుకొని జాగింగ్‌కు వెళితే స్థానికులు గుర్తుపట్టారు. కొద్ది దూరం వెంటపడి, తనతో ఫొటోలు తీసుకొనేందుకు ఆసక్తి చూపారు. అది నాకు మధుర జ్ఞాపకం."
-గిల్‌క్రిస్ట్, ఆసీస్ మాజీ క్రికెటర్
‘భారత్‌లో మళ్లీ ఎప్పుడు అడుగుపెడతానో తెలియదు కానీ, అక్కడికి రావడానికి చాలా ఆశగా ఎదురు చూస్తున్నా’నని గిల్లీ చెప్పుకొచ్చాడు. గిల్‌క్రిస్ట్ ఐపీఎల్‌లో గతంలో డెక్కన్ ఛార్జెర్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. తన నేతృత్వంలో రెండో సీజన్ 2009లోనే జట్టును టైటిల్ విజేతగా నిలబెట్టాడు.