దిగ్గజ క్రికెటర్లు సౌరభ్ గంగూలీ, అనిల్ కుంబ్లే.. కెప్టెన్లలో తనకెప్పుడూ ప్రత్యేకంగా నిలిచిపోతారని వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ పార్థివ్ పటేల్ అన్నాడు. వారిద్దరూ నాయకుడనే పదానికి నిదర్శనమని చెప్పాడు. బుధవారం(డిసెంబరు 9) రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా తనకు మద్దతుగా నిలిచిన గంగూలీ, కుంబ్లే గురించి ఓ వర్చువల్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
"నా దృష్టిలో గంగూలీ నాయకుడనే పదానికి నిదర్శనంలా కనిపిస్తాడు. నేనిలా ఉండటానికి దాదా, కుంబ్లే లాంటి గొప్ప నాయకులే కారణం. నా పేరును తప్పుగా ముద్రించిన టెస్టు క్యాప్‌ను నాకు దాదా ఇచ్చాడు. అది ఇప్పటికీ నా దగ్గరే ఉంది. నా కెరీర్లో హెడ్డింగ్లీ (2002), అడిలైడ్ (2003-04) సిరీస్‌లతో పాటు రావల్పిండిలో అర్ధసెంచరీ చేసినవి నా మధురమైన జ్ఞాపకాలు. క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని ఏడాదిగా అనుకుంటున్నా.. అందుకు సరైన సమయం రాలేదు. దేశవాళీలో అన్ని ట్రోఫీలతో పాటు ఐపీఎల్‌లోనూ మూడు ట్రోఫీలు గెల్చుకోవడం సహా గుజరాత్ క్రికెట్ రూపురేఖలు మార్చడానికి కృషి చేశాను"
- పార్థివ్ పటేల్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
అంతర్జాతీయ క్రికెట్‌కు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ పార్థివ్ పటేల్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం(డిసెంబరు 9) ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే పార్థివ్ రిటైర్మెంట్పై పలువురు మాజీలు స్పందించారు.
"భారత క్రికెట్‌కు పార్థివ్ పటేల్ ఓ తెలివైన ప్రచారకర్త. కెప్టెన్ కావాల్సినా సరే జట్టు సభ్యునిలా ఉన్నాడు. 17 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. క్రికెట్లో అతడి అద్భుతమైన ప్రదర్శనే దేశవాళీతో పాటు అంతర్జాతీయ క్రికెట్లో పురస్కారాలను తెచ్చిపెట్టింది. తన అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు తెలియజేయడం సహా భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు"
- సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
"అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు పార్థివ్. నీ వైఖరి ఎప్పుడూ అండగా నిలిచింది. రావల్పిండిలో పాకిస్థాన్‌తో టెస్టులో ఓపెనర్‌గా ఆడిన మీ ఇన్నింగ్స్ నాకు ఇప్పటికీ గుర్తుంది. మీ భవిష్యత్‌కు శుభాకాంక్షలు"
- సచిన్ తెందుల్కర్, దిగ్గజ క్రికెటర్
"అద్భుతమైన కెరీర్‌ను రూపొందించుకున్న పార్థివ్ పటేల్‌కు శుభాకాంక్షలు. అతడితో అనుబంధం నా జీవితంలో మధుర క్షణాలుగా నిలిచిపోతాయి. నాకు తెలిసి భవిష్యత్‌లోనూ నువ్వు ఆట కోసమే నీ జీవితాన్ని వెచ్చిస్తావు. నీ జీవితంలోని రెండో ఇన్నింగ్స్‌కు గుడ్‌లక్"
- వీవీఎస్ లక్ష్మణ్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
"నీ భవిష్యత్ ప్రణాళికలకు ఆల్ ది బెస్ట్. క్రికెట్లో మీ ఉత్తమమైన కెరీర్‌కు అభినందనలు. మీతో కలిసి మైదానంలో ఆడటం నాకెంతో ఆనందంగా ఉంది".
- జస్ప్రీత్ బుమ్రా, టీమ్ఇండియా పేసర్
పార్థివ్ టీమ్ఇండియా తరపున 25 టెస్టులు, 38 వన్డేలు, 2 అంతర్జాతీయ టీ20లు ఆడాడు. టెస్టుల్లో 6 అర్ధసెంచరీలు సాధించి.. అత్యధికంగా 69 (పాకిస్థాన్‌పై) పరుగులు చేశాడు. ఐపీఎల్లో 139 మ్యాచ్‌లు ఆడి, 2,848 పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో ఉన్నప్పుడు మూడు సార్లు ట్రోఫీని ముద్దాడాడు.
ఇదీ చూడండి: పార్థివ్ పటేల్ రిటైర్మెంట్.. అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు