దేశంలో క్రికెట్ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించే విషయంలో తొందరపాటు పనికిరాదని, వేచి చూసే ధోరణి అవలంభించాలని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు.
"దేశంలో క్రికెట్‌ను పునఃప్రారంభించే స్థితిలో మనం లేమని అనుకుంటున్నా. ఇంకొంత సమయం వేచి చూడడం ఉత్తమం. నెలవారీగా పరిస్థితులు సమీక్షించుకుంటూ సాగాలి. అన్ని అవకాశాలనూ పరిశీలించాలి. సాధారణంగా ఆగస్టు- సెప్టెంబర్‌లో మొదలయ్యే దేశవాళీ సీజన్‌ను అక్టోబర్‌లో ప్రారంభించి, అవసరమైతే షెడ్యూల్‌ను కుదించాలి. ప్రస్తుతానికైతే ఏ విషయం మీద స్పష్టత లేదు. ఈ ఏడాది ఎంత క్రికెట్ ఆడగలమో, దానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయో లేదో అనేది ప్రభుత్వ, వైద్య వర్గాల సూచనలపై ఆధారపడి ఉంటుంది
రాహుల్ డ్రావిడ్, భారత మాజీ కెప్టెన్
జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఏప్రిల్ నుంచి జూన్ వరకూ తీరికలేకుండా ఉండేదని, ఆ సమయంలో జోనల్, అండర్-16, 19, 23 శిబిరాలు నిర్వహించే వాళ్లమని అకాడమీ డైరెక్టర్ కూడా అయిన ద్రవిడ్ వెల్లడించాడు. అయితే ప్రస్తుతం శిబిరాల కోసం కొత్తగా ప్రణాళికలు రూపొందించాల్సి ఉందని అన్నాడు. "ప్రభుత్వం అనుమతిస్తే మొదటగా స్థానిక క్రికెటర్ల కోసం ఎన్‌సీఏను తెరుస్తాం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్లు తప్పనిసరిగా 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది కాబట్టి అది సాధ్యమవుతుందో లేదో చూడాలి. అంతర్ రాష్ట్ర ప్రయాణాల పట్ల ఆటగాళ్లు సౌకర్యంగా ఉన్నారా అని తెలుసుకోవాలి" అని అతను చెప్పాడు.
అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి ఆరంభంగా భావిస్తున్న ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్‌ను బయో సెక్యూర్ వాతావరణంలో నిర్వహించనున్నారు. వచ్చే నెల 8న ఇంగ్లాండ్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ విషయంపై డ్రావిడ్ స్పందిస్తూ.. "అంతర్జాతీయ క్రికెట్లో బయో సెక్యూర్ విధానం అమలు సాధ్యమవుతుంది. ఇంగ్లాండ్, విండీస్ సిరీస్ మన అందరికీ ఓ పాఠం కాబోతుంది. మ్యాచ్‌లు నిర్వహణలో సవాళ్లు ఎదురు కానున్నాయి. మన దేశవాళీ స్థాయిలో ఆ విధానం అమలు చేయడం అంత సులభం కాదు" అని అతను పేర్కొన్నాడు.