మరో ఐదు రోజుల్లో భారత్-ఆస్ట్రేలియా సిరీస్ ప్రారంభం కానుంది. కరోనా తర్వాత టీమ్ఇండియా ఆడనున్న తొలి అంతర్జాతీయ సిరీస్ కనుక అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్‌లో ఎవరు నెగ్గుతారన్నది ఫ్యాన్స్‌లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సందర్భంగా ఇప్పటివరకు ఆసీస్‌తో జరిగిన పోరుల్లో ద్విశతకాలు చేసిన ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.
సచిన్ తెందుల్కర్ (241*, 214)
ఆసీస్ గడ్డపై సచిన్ తెందుల్కర్ 2004లో మొదటిసారి డబుల్ సెంచరీ చేశాడు. సిడ్నీలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 241 పరుగులు చేశాడు లిటిల్ మాస్టర్. ఆ తర్వాత 2010లో బెంగళూరు వేదికగా ఆసీస్‌తో తలపడ్డ మ్యాచ్‌లోనూ రెండో ద్విశతకాన్ని బాదాడు సచిన్.
వీవీఎస్ లక్ష్మణ్ (281, 200*)
2001 కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన టెస్ట్‌లో వీవీఎస్ లక్ష్మణ్ ఆస్ట్రేలియాపై 281 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. 2008 దిల్లీ టెస్టులో 200 నాటౌట్‌తో రాణించాడు.
ఛెతేశ్వర్ పుజారా(204, 202)
హైదరాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పుజారా 204 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ 2013లో జరిగింది. రాంచీ వేదికగా 2017లో ఛెతేశ్వర్ పుజారా.. ఆసీస్ జట్టుపై మరో ద్విశతకం చేశాడు.
రవి శాస్త్రి (206)
ప్రస్తుతం భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తోన్న రవిశాస్త్రి 1992లో సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌పై డబుల్ సెంచరీ చేశాడు.
రాహుల్ ద్రవిడ్(233)
2003లో జరిగిన ఆడిలైడ్ టెస్ట్‌లో 233 పరుగుల మెరుపు ఇన్సింగ్స్ ఆడాడు రాహుల్ ద్రవిడ్. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌పై భారత్ నెగ్గింది.
గౌతమ్ గంభీర్(206)
2008లో హోంగ్రౌండ్ దిల్లీలో గౌతమ్ గంభీర్ ఆస్ట్రేలియాపై చెలరేగిపోయాడు. 206 పరుగులు చేశాడు. వీవీఎస్ లక్ష్మణ్ తన రెండో డబుల్ టన్ చేసింది కూడా ఈ మ్యాచ్‌లోనే కావడం విశేషం.
ఎం ఎస్ ధోనీ(224)
భారత జట్టు మాజీ సారథి ఎంఎస్ ధోనీ చెన్నై టెస్టులో ఆస్ట్రేలియాపై ద్విశతకం చేశాడు. ఇదే ధోనీ మొదటి డబుల్ కావడం విశేషం.
వన్డేల్లో ఒకే ఒక్కడు..
రోహిత్ శర్మ(209)
వన్డే మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాపై డబుల్ సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 2013లో బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ 209 పరుగులు చేశాడు. 158 బంతుల్లో 12 సిక్సులు, 16 ఫోర్లతో రోహిత్ ఆసీస్ జట్టుకు చుక్కలు చూపించాడు.
ఇదీ చదవండి:ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు రోహిత్, ఇషాంత్ కష్టమే!