ఘనమైన క్రికెట్ చరిత్ర గల వెస్టిండీస్.. పరిమిత ఓవర్ల క్రికెట్లో పర్వాలేదనిపిస్తున్నా చాలా ఏళ్లుగా టెస్టుల్లో మాత్రం తేలిపోతోంది. కానీ అంతర్జాతీయ క్రికెట్ పునఃప్రారంభంలో పెద్ద సంచలనం సృష్టించింది. ఆతిథ్య ఇంగ్లాండ్‌కు కరీబియన్ జట్టు షాకివ్వడం ఎవరూ ఊహించనిదే. విండీస్ రెట్టించిన విశ్వాసంతో ఇప్పుడు ఏకంగా సిరీస్‌పైనే కన్నేసింది. అది అంత తేలికేమీ కాదు. కానీ అసాధ్యమూ కాదన్న ధీమాతో కరీబియన్ జట్టు ఉంది. సౌథాంప్టన్‌లో పైచేయి సాధించిన విండీస్.. అదే ఉత్సాహంతో ఇప్పుడు మరో సమరానికి సిద్ధమైంది. నేటి నుంచే రెండో టెస్టు. ఇంగ్లాండ్ ప్రతీకారేఛ్చతో ఉన్న నేపథ్యంలో ఆసక్తికర పోరు ఖాయం. వెండీస్ చివరిసారి 1988లో ఇంగ్లాండ్‌లో సిరీస్ గెలిచింది.
కరోనా మహమ్మారి భయపెడుతున్నా మరో టెస్టుకు వేళైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం, మాంచెస్టర్ వేదికగా ఆరంభమయ్యే రెండో టెస్టులో వెస్టిండీస్ జట్టు.. ఆతిథ్య ఇంగ్లాండ్‌ను ఢీకొంటుంది. మొదటి టెస్టులో రెండు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడిన నేపథ్యంలో ఈ మ్యాచ్ ఆసక్తిరేపుతోంది. ఆల్‌రౌండ్ సత్తా చాటిన విండీస్ ఆ టెస్టులో 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్ సొంతం చేసుకోవాలని తపిస్తోంది. గెలిస్తే.. 25 ఏళ్లలో విదేశీ గడ్డపై ఓ పెద్ద టెస్టు దేశంపై టెస్టు సిరీస్ నెగ్గడం విండీస్‌కు ఇదే తొలిసారి అవుతుంది. కానీ ప్రతీకారేచ్ఛతో ఉన్న ఇంగ్లాండ్ ఆ అవకాశమిస్తుందా?
హుషారుగా వెస్టిండీస్
సౌథాంప్టన్‌లో అన్ని విభాగాల్లోనై పైచేయి సాధించిన వెస్టిండీస్ అదే జోరును మాంచెస్టర్‌లోనూ కొనసాగించాలనుకుంటోంది. ముఖ్యంగా కెప్టెన్ జేసన్ హోల్డర్, గాబ్రియెల్ బంతితో విజృంభిస్తుండడం ఆ జట్టుకు గొప్ప సానుకూలాంశం. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హోల్డర్ ఆరు వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. గ్రాబియెల్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు. వీళ్లకు తోడు రోచ్, అల్జారి జోసెఫ్‌లతో విండీస్ పేస్ దళం చాలా పదునుగా కనిపిస్తోంది. ఇక బ్యాటింగ్‌లోనూ విండీస్ బాగానే కనిపిస్తోంది. బ్లాక్‌వుడ్ సూపర్ ఫామ్ విండీస్‌కు గొప్ప బలం. తొలి టెస్టులో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన అతడు.. ఛేదనలో 95 పరుగులతో అజేయంగా నిలిచి విండీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడు అదే ఫామ్‌ను కొనసాగించాలని విండీస్ ఆశిస్తోంది. బ్రాత్‌వైట్, చేజ్‌ల ఫామ్ కూడా ఆ జట్టుకు కలిసొచ్చేదే.
రూట్ వస్తున్నాడు..
సిరీస్ ఆరంభ టెస్టులో ఓడడం ఆ జట్టుకు కొత్తేమీ కాదు. గత పది సిరీస్‌లో ఎనిమిదింటిని ఇంగ్లాండ్ ఓటమితోనే ఆరంభించింది. చివరగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో మొదటి టెస్టు ఓడి కూడా 3-1తో సిరీస్‌ను గెలుచుకుంది. అయితే విండీస్‌పై రెండో టెస్టులో నెగ్గాలంటే ఇంగ్లాండ్ బ్యాటింగ్ మెరుగుపడడం అవసరం. ఈ నేపథ్యంలో తొలి టెస్టుకు దూరమైన కెప్టెన్ జో రూట్ తిరిగి జట్టుతో చేరడం ఆ జట్టుకు ఉత్సాహాన్నిచ్చేదే. రూట్.. డెన్లీ స్థానంలో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు. ఆల్‌రౌండర్ స్టోక్స్ మంచి ఫామ్‌లో ఉండడం ఇంగ్లాండ్‌కు సానుకూలాంశం. ఇప్పుడే కెప్టెన్సీ భారం కూడా లేకపోవడం వల్ల అతడితో విండీస్‌కు ముప్పు పెరగనుంది. బంతిలోనూ అతడు కీలకమే. క్రాలే ఫామ్ కూడా ఇంగ్లాండ్‌కు సానుకూలాంశమే. పేస్ బౌలర్ బ్రాడ్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. మధ్యాహ్నం 3.30కు ఆరంభమయ్యే ఈ మ్యాచ్ సోనీ నెట్‌వర్క్‌లో ప్రసారం కానుంది.
ఇది చూడండి : మూడు నెలలు వేచి చూద్దాం.. రాష్ట్రాలకు రిజిజు సూచన