ఈ ఏడాది జరిగే ఐపీఎల్లో పాల్గొని, టీమిండియాలో తిరిగి చోటు సంపాదించాలనుకున్నాడు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. కానీ కరోనా మహ్మమారి వల్ల లీగ్ వాయిదా పడింది. దీంతో మహీ రిటైర్మెంట్పై మళ్లీ చర్చ మొదలైంది. అతడి పని అయిపోయినట్లేనని వార్తలు వస్తున్నాయి. తాజాగా దీని గురించి మాట్లాడిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్.. ఈ విషయంలో ధోనీపై ఒత్తిడి తీసుకురావొద్దని పేర్కొన్నాడు.
"నా దృష్టిలో ధోనీకి ఆడే సత్తా ఇంకా ఉంది. ఛేదనలో ఒకటి రెండుసార్లు తప్పులు చేశాడు. అయితే మహీలో చాలా ప్రతిభ దాగుంది. ఒకవేళ ధోనీ వెళ్లిపోతే తిరిగి తీసుకురాలేరు. దిగ్గజాలు కొందరే ఉంటారు. అలాంటి వారిలో ఇతడు ఒకడు. రిటైర్మెంట్ విషయంలో మహీపై ఒత్తిడి తీసుకురావొద్దు" -నాసిర్ హుస్సేన్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్
గతేడాది వన్డే ప్రపంచకప్లో సెమీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు తాత్కాలిక విరామం ప్రకటించాడు ధోనీ. అప్పటినుంచి అతడి రిటైర్మెంట్పై పలు వార్తలు వస్తూనే ఉన్నాయి.