టీ20 ప్రపంచకప్‌ను తొందరపడి వాయిదా వేయొద్దని అధికారులకు సూచించాడు పాకిస్థాన్ ప్రధాన సెలెక్టర్, కోచ్ మిస్బా ఉల్ హక్. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ ప్రయాణమనేది కష్టతరమైనదని.. దీనిపై అధికారులు ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలని సూచించాడు.
"ఒకేసారి 16 జట్లకు ఆతిథ్యం ఇవ్వడం, వారు ప్రయాణం చేయడం సులభమైన పని కాదు. కానీ, అధికారులు అందుకు సమయం ఇవ్వాలి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు నెల లేదా అంతకంటే ఎక్కువ రోజుల సమయం వేచి చూసి పరిస్థితులను గమనించాలి. టీ20 ప్రపంచకప్ చూడటానికి ప్రతి ఒక్కరూ ఆత్రుతగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కార్యక్రమాలు మొదలైన క్రమంలో ఈ టోర్నీ నిర్వహించడం ఉత్తమం".
- మిస్బా ఉల్ హక్, పాక్ కోచ్, ఛీఫ్ సెలెక్టర్
పాకిస్థాన్, ఇంగ్లాండ్‌కు మధ్య మూడు టెస్టులు, మూడు టీ20లను జులై నుంచి బయో సెక్యూర్ వాతావరణంలో నిర్వహించాలని ఇరు దేశాల క్రికెట్ బోర్డులు నిర్ణయించాయి. 25 నుంచి 27 మంది క్రీడాకారులను ఇంగ్లాండ్ పంపించడానికి ప్రత్యేక విమానాలను సిద్ధం చేస్తామని పాక్ బోర్డు ఇటీవలే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లకు ఇష్టం లేకుండా విదేశీ పర్యటనకు పంపమని కూడా తేల్చి చెప్పింది పీసీబీ.
"ఈ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా నిరాశాభావం నెలకొంది. దీనివల్ల ప్రజలు వినోదాన్ని కోల్పోయారు. ఈ పరిస్థితి నుంచి వారు ముందుకు సాగాలని కోరుకుంటున్నారు. అందువల్ల మనం ఒకసారి దీన్ని (పాకిస్థాన్, ఇంగ్లాండ్ సిరీస్) ప్రయత్నించాలి" అని మిస్బా అభిప్రాయపడ్డాడు.
ఇదీ చూడండి... 'మరి ఆ రోజుల్లో ఫోన్ మాట్లాడాలంటే..'