అప్పటికి రెండు జట్లూ కలిపి 23 వికెట్లు కోల్పోయాయి.. నమోదైన పరుగులు 373 పరుగులు మాత్రమే. ప్రత్యర్థి జట్టు అయితే 76/9 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆ స్థితిలో ఏడో స్థానంలో వచ్చిన ఓ ఆటగాడు 270 పరుగులు చేయడమంటే మాటలా? అందులోనూ అతను ఫ్లూ జ్వరంతో బాధ పడుతూ అలాంటి ఇన్నింగ్స్ ఆడటం నమ్మశక్యం కాని విషయం. ఈ ఇన్నింగ్స్‌తో సిరీస్ గమనమే మారిపోయింది. 0-2తో వెనుకబడి ఉన్న కంగారూ జట్టు.. చివరికి సిరీస్‌ను 3-2తో చేజిక్కించుకుంది. అందుకే బ్రాడ్‌మన్ ఇన్నింగ్స్‌కు అంత విలువ!
డాన్ బ్రాడ్‌మన్‌కు కెప్టెన్‌గా తొలి సిరీస్ అది. ఆసీస్ చిత్తుగా ఓడిన తొలి రెండు టెస్టుల్లో అతను రెండుసార్లు డకౌటయ్యాడు.మెల్‌బోర్న్‌లో మూడో టెస్టు ఆరంభమైంది. ఆసీస్ మరోసారి తడబడింది. 130 పరుగులకే 6 వికెట్లు పడ్డాయి. కోలుకుని 200 పరుగుల మార్కును అందుకుంది. అయితే పిచ్ బౌలర్ల స్వర్గధామంలా కనిపించడంతో ఒక వికెట్ చేతిలో ఉండగానే ఆసీస్ 200 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కంగారూ బౌలర్ల ధాటికి కుదేలైన ఇంగ్లాండ్ 76/9కు చేరుకుంది. పిచ్‌ను ఉపయోగించుకుందామని ఆ జట్టు కూడా ఒక వికెట్ ఉండగానే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
ఇక్కడ కెప్టెన్‌గా బ్రాడ్‌మన్ వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. 9, 10, 11 నంబర్ ఆటగాళ్లను తొలి మూడు స్థానాల్లో దించాడు. తర్వాత ఓపెనర్లను ఆడించాడు. వీళ్లు వెళ్లి పిచ్ తీవ్రత తగ్గే వరకు కాచుకోవాలన్నది డాన్ వ్యూహం. అది బాగానే పని చేసింది. మూడో స్థానంలో ఆడే బ్రాడ్‌మన్ ఏడో స్థానంలో దిగాడు ఆ ఇన్నింగ్స్‌లో. అతనొచ్చే సమయానికి స్కోరు 97/5. అప్పటికి పిచ్ కొంచెం పొడిబారి బ్యాటింగ్‌కు సహకరించడం మొదలుపెట్టింది. ఫింగిల్‌టన్ (137) సహకారంతో మ్యాచ్ ముఖచిత్రాన్నే మార్చేశాడు డాన్. మూడో రోజు సాయంత్రం వర్షపు జల్లులు పడుతుండగానే బ్యాటింగ్ సాగించిన డాన్, ఫింగిల్‌టన్.. వరుసగా 56, 39 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఆసీస్ స్కోరు 194/5. అప్పటికే డాన్ ఫ్లూ బారిన పడ్డాడు. వాతావరణం అతణ్ని మరింత ఇబ్బంది పెట్టింది. తర్వాతి రోజు జ్వరంతోనే బ్యాటింగ్‌కు వచ్చాడు. కానీ ఆ ప్రభావం ఎంత మాత్రం కనిపించనివ్వకుండా మెరుపు బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్ బౌలింగ్‌ను ఆటాడుకున్నాడు.
నాలుగో రోజు ఆట మొదలైన గంటలోనే అతని శతకం పూర్తయిపోయింది. ఆ రోజు సాయంత్రానికి అతని స్కోరు 248 పరుగులకు చేరుకుంది. బంతి కాళ్ల దగ్గర పడితే ఫ్లిక్, కాస్త లేస్తే హుక్, ఆఫ్ సైడ్ గతి తప్పితే స్క్వేర్ కట్.. ఇలా అద్భుతమైన షాట్లతో అభిమానుల్ని మంత్రముగ్ధుల్ని చేశాడు బ్రాడ్‌మన్. అయిదో రోజు ఇంకో 22 పరుగులు జోడించి 270 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను ముగించాడు డాన్. అతని స్కోరులో 22 బౌండరీలున్నాయి. 110 పరుగులు సింగిల్స్ రూపంలో వచ్చాయంటేనే బ్రాడ్‌మన్ ఎంత కష్టపడ్డదీ అర్థం చేసుకోవచ్చు. ఫింగిల్‌టన్‌తో అతను ఆరో వికెట్‌కు రికార్డు స్థాయిలో 346 పరుగులు జోడించడంతో రెండో ఇన్నింగ్స్‌లో 564 పరుగుల భారీ స్కోరు చేసిన కంగారూ జట్టు.. ఇంగ్లాండ్ ముంగిట 689 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. తొలి ఇన్నింగ్స్‌తో పోలిస్తే ఇంగ్లాండ్ ఎంతో మెరుగ్గా ఆడినప్పటికీ.. 323 పరుగులే చేయగలిగింది. దీంతో 365 పరుగుల భారీ విజయం ఆసీస్ సొంతమైంది.
పతాక స్థాయి ఫామ్ అందుకున్న డాన్.. చివరి రెండు టెస్టుల్లో 212, 169 పరుగుల ఇన్నింగ్స్‌లతో జట్టుకు విజయాలందించాడు. దీంతో ఆసీస్ 3-2తో సిరీస్‌ను ఎగరేసుకుపోయింది. అప్పటికి అయిదు టెస్టుల పోరులో 0-2తో వెనకబడి సిరీస్ గెలిచిన తొలి జట్టు ఆసీసే. జ్వరంతో బాధపడుతూ అంత గొప్ప ఇన్నింగ్స్ ఆడటం, కెప్టెన్‌గానూ వ్యూహాత్మకంగా వ్యవహరించి జట్టును గట్టెక్కించడం.. పరాభవం తప్పదనుకున్న సిరీస్‌లో ఆసీస్‌కు అద్భుత విజయాన్నందించడం వల్ల బ్రాడ్‌మన్ పేరు మార్మోగిపోయింది. అతణ్ని దిగ్గజాన్ని చేసిన సిరీస్ ఇది. మంత్రముగ్ధమైన తన బ్యాటింగ్‌తో జనాల దృష్టిని ఆకర్షించి.. వారిలో క్రికెట్ మైకం కమ్మి తన కోసమే మైదానాలకు వచ్చేలా చేసిన ఘనుడు బ్రాడ్‌మన్. మేటి బౌలింగ్‌ను ఎదుర్కొంటూ అలవోకగా భారీ ఇన్నింగ్స్‌లు ఆడి తిరుగులేని గణాంకాలు నమోదు చేసిన అతణ్ని క్రికెట్ ప్రపంచం 'డాన్'గా ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.