కెరీర్ ప్రారంభం నుంచి మిడిలార్డర్లోని వివిధ స్థానాల్లో ఆడిన మాజీ కెప్టెన్ ధోనీ.. టీమ్ఇండియాకు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. ఫినిషర్‌గానూ అదరగొట్టి మ్యాచ్‌ల్ని గెలిపించిన సందర్భాలు అనేకం. అయితే మహీకి ఇష్టమైన స్థానం? అంటే మనం ఐదు లేదా ఆరు అని అనుకుంటాం కానీ అతడికి నాలుగో స్థానమంటే చాలా ఇష్టమని మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ చెప్పాడు.
"ఈ విషయంలో నేను అంచనా తప్పొచ్చు. కానీ నాలుగో స్థానంలో ఆడటమంటే చాలా ఇష్టమని ధోనీనే గతంలో చెప్పాడు. కానీ జట్టు అవసరాల దృష్ట్యా దిగువ స్థానాల్లో అతడు ఆడాల్సి వచ్చిందని నా అభిప్రాయం. నాలుగులో ఆడిన మహీ ఎన్నో మ్యాచ్‌ల్ని ఒంటిచేత్తో గెలిపించాడు. మనందరం మైకేల్ బేవన్ గురించి మాట్లాడుతాం కానీ ధోనీనే ఆ స్థానానికి సరైన బ్యాట్స్‌మన్"
-ఆర్పీ సింగ్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
ధోనీ చాలా మృదు స్వభావి అని, అందరితో చాలా కలిసిమెలసి ఉంటాడని ఆర్పీ సింగ్ తెలిపాడు. కానీ ఫోన్ చేస్తే ఎప్పుడూ రిసీవ్ చేసేవాడు కాదని అన్నాడు. ఈ విషయమై తాను, మునాఫ్ పటేల్ ఓసారి మహీని అడగ్గా, ఇప్పుడు కుదరదని రిటైర్మెంట్ తీసుకున్నాక సగం రింగ్‌కే ఫోన్ ఎత్తి మాట్లాడుతానని చెప్పినట్లు గుర్తుచేసుకున్నాడు. ఇప్పుడు మహీకి ఫోన్ చేస్తే ఏం జరుగుతుందో చూడాలని ఆర్పీ సింగ్ అన్నాడు. ధోనీ నేతృత్వంలో 2007 టీ20 ప్రపంచకప్ గెల్చుకున్న టీమ్ఇండియాలో ఇతడు సభ్యుడు.