యాషెస్ సిరీస్‌లో ఘోరంగా విఫలమై విమర్శలు ఎదుర్కొన్న ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో విజృంభించి సిరీస్ క్లీన్ స్వీప్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 50కి పైగా పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు.
శ్రీలంకతో జరిగి తొలి టీ20లో 56 బంతుల్లోనే సెంచరీ (100*) పూర్తి చేసిన వార్నర్ రెండో మ్యాచ్‌లో 60* పరుగులు చేశాడు. శుక్రవారం జరిగిన మూడో మ్యాచ్‌లో మరో అర్ధసెంచరీతో (57*) రెచ్చిపోయాడు. ఈ సిరీస్‌లో మొత్తం 217 పరుగులు చేశాడు వార్నర్. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ ఆసీస్ ఓపెనర్‌గా నాటౌట్‌గా నిలవడం విశేషం.
డేవిడ్ వార్నర్ కంటే ముందు విరాట్ కోహ్లీ, కొలిన్ మన్రో ఈ ఘనత సాధించారు. 2015-16 సీజన్లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో విరాట్ (90*, 59*, 50) మూడు అర్ధశతకాలు నెలకొల్పాడు. కివీస్ ప్లేయర్ కొలిన్ మన్రో 2017-18లో ఈ ఘనత సాధించాడు.
టీ20ల్లో 2 వేలకు పైగా పరుగులు చేసిన తొలి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌గా రికార్డు సాధించాడు వార్నర్. ఆసీస్ గడ్డపై వంద సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగానూ ఘనత సాధించాడు. డేవిడ్ కంటే ముందు ఆడమ్ గిల్‌క్రిస్ట్ (105) ఉన్నాడు.
మేల్బోర్న్ వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన లంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. కుశాల్ మెండీస్ (57) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్.. డేవిడ్ వార్నర్ (57*), ఫించ్ (37) ధాటికి 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
ఇదీ చదవండి: ఒలింపిక్స్ అర్హతకు అడుకు దూరంలో భారత హాకీ జట్లు