.
బ్యాట్స్‌మన్ : అజయ్ జడేజా
పరుగులు : 45
బంతులు : 25
బౌండరీలు : 4 ఫోర్లు, 2 సిక్సర్లు
ప్రత్యర్థి : పాకిస్థాన్
ఫలితం : 39 పరుగుల తేడాతో భారత్ గెలుపు
సంవత్సరం : 1996
అది 1996 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్. వేదిక బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం. అజహరుద్దీన్ నేతృత్వంలో భారత్, అమీర్ సోహైల్ సారథ్యంలోని పాక్ ఉత్కంఠభరిత సమరానికి సిద్ధమయ్యాయి. గాయంతో అసలు కెప్టెన్ వసీమ్ అక్రమ్ దూరమైనా.. వకార్ యూనిస్, అకిబ్ జావేద్, అతావుర్ రెహ్మాన్, ముస్తాక్ అహ్మద్‌లతో పాక్ బౌలింగ్ బలంగానే ఉంది. టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. సిద్దూ (93), సచిన్ (31) తొలి వికెట్‌కు 90 పరుగులు జోడించారు. మంజ్రేకర్ 43 బంతుల్లో 20 పరుగులు చేశాడు. 42వ ఓవర్లో అజహరుద్దీన్ (22 బంతుల్లో 27) నాలుగో వికెట్‌గా ఔటయ్యేటప్పటికి స్కోరు 200. అప్పుడొచ్చాడు జడేజా. 45 ఓవర్ల స్కోరు 225/4. 47 ఓవర్లకు స్కోరు 236/6. క్రీజులో జడేజాతో పాటు కుంబ్లే. భారత్ మంచి స్కోరు చేసేలా కనిపించినా.. బలమైన లైనప్‌ను ఉన్న పాకిస్థాన్‌ను అడ్డుకోవాలంటే పెద్ద స్కోరే అవసరం. అయితే వకార్ యూనిస్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. పదునైన పేస్‌తో బ్యాట్స్‌మెన్‌ను కళ్లెం వేసిన అతడు తొలి ఎనిమిది ఓవర్లలో ఇచ్చింది కేవలం 27 పరుగులే. అతడికి మరో రెండు ఓవర్లు ఉండడం వల్ల భారత్ కోరుకున్నంత స్కోరు చేయలేదేమో అనిపించింది.
విశ్వరూపం..
ఒక్కసారిగా విరుచుకుపడ్డ జడేజా.. విధ్వంసక బ్యాటింగ్ విన్యాసాలతో యూనిస్ బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ టీమ్ ఇండియాకు ఊహించనంత స్కోరును అందించాడు. అప్పటిదాకా గొప్పగా బౌలింగ్ చేసిన వకార్ గణాంకాలను జడేజా.. నిర్దాక్షిణ్యంగా సవరిస్తుంటే అభిమానుల కేరింతలతో స్టేడియం దద్దరిల్లిపోయింది. అతడి బుల్లెట్ షాట్ల ధాటికి భీతిల్లిపోయిన వకార్ మిగిలిన తన రెండు ఓవర్లలో వరుసగా 22, 18 పరుగులు సమర్పించుకున్నాడు. ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేస్తూ జడేజా చెలరేగిన తీరు మరచిపోలేనిది. 48వ ఓవర్ వకార్‌కు ఓ పీడకల. ఎందుకంటే తొలి బంతి జడేజా మూడు పరుగులు తీయగా.. తర్వాతి రెండు బంతులను కుంబ్లే బౌండరీకి తరలించాడు. ఆ తర్వాత సింగిల్ తీశాడు. అయిదో బంతిని అలవోకగా కవర్స్ బౌండరీకి తరలించిన జడేజా. ఆరో బంతిని మరింత నిర్దాక్షిణ్యంగా బాదేశాడు. బంతి అలా పడిందో లేదో.. అంతే వేగంతో స్టాండ్స్‌లో పడేసి స్టేడియాన్ని హోరెత్తించాడు. తర్వాత అకిబ్ జావెద్ ఓవర్లోనూ ఓ ఫోర్ కొట్టిన జడేజా.. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో మళ్లీ వకార్‌ను ఓ ఆటాడుకున్నాడు. తొలి బంతిని థర్డ్‌మన్‌లో బౌండరీ దాటించిన అతడు.. రెండో బంతిని లాంగాఫ్‌లో సిక్స్ దంచేశాడు. వెంటనే అతడు ఔటైనా పాకిస్థాన్‌ను మానసికంగా కొట్టిన దెబ్బ అంతా ఇంతా కాదు.
ఆ ఓవర్లో మరో ఎనిమిది పరుగులు రాగా.. మొత్తంగా చివరి 3 ఓవర్లలో భారత్ ఏకంగా 51 పరుగులు సాధించింది. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన జడేజా 45 పరుగులు(25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు).. మోంగియా (3), కుంబ్లే (10), శ్రీనాథ్ (12 నాటౌట్)తో కలిసి 25 బంతుల్లోనే 61 పరుగులు జోడించాడు. 287/8 ముగించిన భారత్.. ఛేదనలో పాకిస్థాన్‌ను 248/9కే పరిమితం చేసి ప్రపంచకప్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: ఐపీఎల్‌పై ఆశలు.. టోర్నీకి తగ్గట్లు ఆసీస్ బోర్డు షెడ్యూల్!