అబుదాబిలో జరుగుతున్న టీ10 లీగ్‌లో చారిత్రక ఇన్నింగ్స్ ఆడాడు ఆసీస్ బ్యాట్స్‌మన్ క్రిస్‌లిన్. ఈ టోర్నీలో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. మరాఠా అరేబియన్స్ తరఫున ఆడుతున్న లిన్... సోమవారం షేక్ జయ్యద్ స్టేడియంలో అబుదాబి జట్టుపై చెలరేగిపోయాడు. 30 బంతుల్లోనే 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 91 పరుగులు చేశాడు. ఇతడి బ్యాటింగ్ ధాటికి ఆ జట్టు 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనలో అబుదాబి జట్టు నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 114 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా 24 పరుగుల తేడాతో మరాఠా అరేబియన్స్ గెలుపొందింది.
గతేడాది ఇదే జట్టుకు చెందిన ఇంగ్లాండ్ క్రికెటర్ ఆలెక్స్ హేల్స్(32 బంతుల్లో 87 పరుగులు*) బెంగాల్ టైగర్స్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించాడు. తాజాగా హేల్స్‌ను వెనక్కినెట్టి తొలిస్థానాన్ని కైవసం చేసుకున్నాడు లిన్. ఇటీవలే 2020 ఐపీఎల్ వేలానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు క్రిస్‌లిన్‌ను విడిచిపెట్టింది.
ఇప్పటివరకు ఈ ఆటగాడు ఐపీఎల్‌లో కోల్‌కతా తరఫున 41 మ్యాచ్‌లు ఆడగా... 1280 పరుగులు చేశాడు. ఆ ఫ్రాంఛైజీ అతడిని వదిలేయడం వల్ల 2020 వేలానికి సిద్ధమయ్యాడు.