భారత టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్ పుజారా.. రాబోయే ఐపీఎల్‌పై దృష్టి సారించినట్లు వెల్లడించాడు. ఈసారి వేలంలో చెన్నై జట్టులో చోటు దక్కించుకున్న అతడు.. మరోసారి ధోనీ సారథ్యంలో ఆడటానికి ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ఐపీఎల్లో ఆడటం కోసం సుదీర్ఘ కాలంగా వేచి చూస్తున్నట్లు నయా వాల్ పేర్కొన్నాడు. ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా మాట్లాడాడు.
ఇంతకాలం ఐపీఎల్లో చోటు దక్కకపోవడం దురదృష్టకరమని పుజారా తెలిపాడు. ఈ సారి చెన్నై తరఫున ఆడనుండటం శుభపరిణామమని అన్నాడు. తనపై నమ్మకం ఉంచిన చెన్నై జట్టుకు కృతజ్ఞతలు చెప్పాడు.
"2010లో ధోనీ సారథ్యంలోనే క్రికెట్ అరంగేట్రం చేశాను. మహీ భాయ్‌తో ఆడిన జ్ఞాపకాలు ఉన్నాయి. తిరిగి ఇప్పుడు ఐపీఎల్‌లోనూ అతడి నాయకత్వంలో ఆడబోతున్నాను. ధోనీకి భిన్న ఫార్మాట్లలో ఆడిన అనుభవం ఉంది. అతడి నుంచి వీలైనన్ని ఎక్కువ విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. అతడితో పాటు సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, మైక్ హస్సీ నేతృత్వంలో చాలా విషయాలు నేర్చుకోవచ్చు."
-ఛెతేశ్వర్ పుజారా, టీమ్ఇండియా క్రికెటర్.
"టెస్టులకు, టీ20లకు తేడా స్పష్టంగా ఉంటుంది. పొట్టి ఫార్మాట్లో వేగంగా పరుగులు సాధించాలి. గతంలో విజయ్ హజారే, ముస్తక్ అలీ టోర్నీ, కౌంటీలతో పాటు దేశవాళీ క్రికెట్ తగినంత ఆడాను. ఆ అనుభవం ఇక్కడ పనికొస్తుంది. మొత్తం మీద నాపై నాకు నమ్మకం ఉంది" అని పుజారా అభిప్రాయపడ్డాడు. టీ20 ఫార్మాట్‌కు తగినట్లు షాట్ల ఎంపిక మార్చుకున్నట్లు నయావాల్ తెలిపాడు. గత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ సిరీస్‌లలో రాణించడం తనకు కలిసొచ్చిందని వెల్లడించాడు.
పంత్ సహజంగా ఆడాడు..
ఇటీవల ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో రిషభ్ తన సహజమైన ఆటతీరును ప్రదర్శించాడని పుజారా తెలిపాడు. 'షాట్ల ఎంపికతో పాటు ఏ రకమైన డెలివరీలను షాట్లుగా ఆడాలో చూసుకోవాలని సూచించాను. ఎప్పుడైనా అనవసర షాట్లకు వెళ్లినప్పుడు మాత్రం అతన్ని హెచ్చరించాను. నేను కూడా అతడి ఆటను ఆస్వాదించాను' అని పుజారా చెప్పుకొచ్చాడు.
కివీస్‌పై ప్రతీకారం తీర్చుకుంటాం..
ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌ల్లో.. భారత్ మెరుగైన ప్రదర్శన చేసిందని ఛెతేశ్వర్ తెలిపాడు. ఆసీస్ పర్యటనలో తొలి టెస్టులో ఓడినప్పటికీ.. తిరిగి పుంజుకోవడం గొప్ప విషయమని పేర్కొన్నాడు. వారి సొంత గడ్డపై ఆసీస్‌ను ఓడించడం ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని వెల్లడించాడు. సౌథాంప్టన్ వేదికగా జరగబోయే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ అనేది ప్రపంచకప్ లాంటిదని అభిప్రాయపడ్డాడు. గతంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో ఓడిపోయాం. ప్రస్తుతం డబ్ల్యూటీసీకి ఆతిథ్యమిస్తున్నది తటస్థ వేదిక. కాబట్టి విజయావకాశాలు ఇద్దరికి చెరి సమానంగా ఉంటాయి. ఈ సారి కివీస్‌పై విజయం సాధించి గత పరాభవానికి బదులు తీర్చుకోవాలని భావిస్తున్నామని పుజారా తెలిపాడు.
ఇదీ చదవండి: 'భారత్‌తో వరుస ఓటములపై మాకు భయం లేదు'