ఈ ఏడాది ఐపీఎల్ పండుగ తేదీలు ఖరారయ్యాయి. వచ్చే నెల 29న ఈ మెగాటోర్నీ మొదలుకానుంది. అంతేకాకుండా ఆరంభ మ్యాచ్‌లో ఛాంపియన్ జట్లు ముంబయి ఇండియన్స్-చెన్నై సూపర్‌కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఒక్కసారిగా సీఎస్కే సారథి మహేంద్రసింగ్ ధోనీపై పడింది.
చెపాక్‌లో ప్రాక్టీస్...
గత ఏడాది న్యూజిలాండ్‌తో వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో భారత్ ఓడిపోయిన తర్వాత నుంచి మహీ... క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. మధ్యలో చాలాసార్లు అతడి రిటైర్మెంట్‌పై వార్తలొచ్చాయి. అయితే 38 ఏళ్ల ధోనీ తిరిగి టీమిండియాలోకి వచ్చేందుకు ఐపీఎల్ వేదికని అంతా భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ మెగాటోర్నీలో అతడి ఫామ్, ప్రదర్శన ఆసక్తికరంగా మారింది. ఇందులో భాగంగానే ఐపీఎల్‌కు సన్నద్ధమయ్యేందుకు మార్చి 1న చెపాక్ స్టేడియంలో మహీ ప్రాక్టీస్ ప్రారంభిస్తాడని తెలుస్తోంది.
ఇప్పటికే రైనా, అంబటి రాయుడు, మురళీ విజయ్ నెట్స్‌లో ప్రతిరోజూ సాధన చేస్తున్నారు. మార్చి 10 నుంచి సీఎస్కే ఆటగాళ్లంతా శిక్షణ కేంద్రానికి హాజరుకానున్నారు. ఇప్పటికే ఒక జట్టుకు 10 సీజన్లుగా సారథిగా ఉన్న ఆటగాడిగా ఘనత సాధించాడు ధోనీ.
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో ఐసీసీ టీ20 ప్రపంచకప్ జగనుంది. ఇందులో చోటు దక్కించుకోవాలంటే ఐపీఎల్లో.. ధోనీ ఫామ్ కీలకంగా మారనుంది.