టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్ చేతన్ చౌహాన్ మృతి పట్ల మాజీ ఆటగాడు చందు బోర్డే సంతాపం వ్యక్తం చేశాడు. కరోనా దుష్ప్రభావాల కారణంగా ఆదివారం చనిపోయిన చేతన్‌తో తమకున్న అనుబంధాన్ని వాళ్లు గుర్తుచేసుకున్నారు.
"చేతన్ మహారాష్ట్ర తరపున ఆడినప్పుడు క్రికెట్ పట్ల చాలా సానుకూలంగా కనిపించేవాడు. అతడి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండేది. ఎంతో శ్రమించేవాడు. అతడు అంకితభావం ఉన్న ఆటగాడు. ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండేవాడు. అది జట్టుకే మేలు చేసేది. సహచర ఆటగాళ్లను ఉత్సాహపరిచేవాడు.. అతడి మాటల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడేది" అని చందు బోర్డే అన్నాడు. 73 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన చేతన్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్నాడు.
ముగిసిన చేతన్ అంత్యక్రియలు
సోమవారం ప్రభుత్వ లాంఛనాలతో.. యూపీలోని హపుర్ జిల్లా గర్‌ముక్తేశ్వర్ నగరంలో చేతన్ అంత్యక్రియలు నిర్వహించారు.
"పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో చేతన్ అంత్యక్రియలు జరిగాయి. ప్రభుత్వ ప్రతినిధుల సమక్షంలో ఆ కార్యక్రమం ముగిసింది. కొంతమంది ఆయనకు తుది వీడ్కోలు పలికేందుకు వచ్చారు" అని అంత్యక్రియలకు హాజరైన దిల్లీ క్రికెట్ సంఘం ప్రతినిధి తెలిపాడు. భారత్ తరపున చేతన్ 40 టెస్టులు, ఏడు వన్డేలాడాడు.