టెస్టు మ్యాచ్‌లో ఒక జట్టు ఒక ఇన్నింగ్స్‌లో 400 చేస్తే భారీ స్కోరని అంటాం. కానీ ఒక్క ఆటగాడు అంత స్కోరు చేస్తే..? ఆ ఇన్నింగ్స్‌ను ఏమని వర్ణించాలి..? అన్ని పరుగులు చేయడానికి ఎంత శక్తి.. ఎంత నైపుణ్యం.. ఎంత ఓపిక.. ఎంత ఏకాగ్రత ఉండాలి..?
"తన స్వార్థం చూసుకున్నాడు".. "జట్టు ప్రయోజనాలు, మ్యాచ్ ఫలితం గురించి ఆలోచించలేదు".. అన్న విమర్శలు పక్కన పెడితే.. లారా ఇన్నింగ్స్ మాత్రం క్రికెట్ ప్రేమికులకు ఓ దృశ్య కావ్యమే!
2004 ఏప్రిల్ 8న సెయింట్‌జాన్స్ మైదానంలో ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య సిరీస్‌లో చివరిదైన నాలుగో టెస్టు ఆరంభమైంది. తొలి మూడు టెస్టుల్లోనూ చిత్తయిన విండీస్.. 0-3తో సిరీస్‌ను కోల్పోయింది. కెప్టెన్ బ్రయాన్ లారా పరాభవ భారాన్ని మోస్తున్నాడు. నామమాత్రమైన చివరి టెస్టులో లారా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 14వ ఓవర్లో 33 పరుగుల వద్ద తొలి వికెట్ పడటంతో లారా క్రీజులోకి వచ్చాడు. 17 పరుగులతో లంచ్‌కు వెళ్లాడు. ఆ తర్వాత వర్షం పడి మూడు గంటలకు పైగా ఆట ఆగిపోయింది. సాయంత్రం 4 గంటలకు ఆటను పునఃప్రారంభించారు. అక్కడి నుంచి మొదలైంది లారా పరుగుల ప్రవాహం. సాయంత్రం మెరుపు షాట్లతో అలరించిన లారా 86 పరుగులతో అజేయంగా నిలిచాడు.
తొలి రోజు సాయంత్రం శర్వాణ్‌తో పాటు పెవిలియన్ చేరిన బ్రయాన్.. రెండో రోజు రిడ్లీ జాకబ్స్‌తో కలిసి హుషారుగా మైదానాన్ని వీడాడు. అప్పటికి స్కోరు 313. తొలి రోజు ఊపును కొనసాగిస్తూ ఇంకో 227 పరుగులు కొట్టేశాడు బ్రయాన్. విండీస్ స్కోరు 595/5. ఆట ఆఖర్లో విండీస్ కెప్టెన్ డిక్లరేషన్ ఇస్తాడేమో అనుకున్నారు చాలామంది. కానీ లారా వదిలిపెట్టలేదు. తర్వాతి రోజూ ఆడుతూ వెళ్లాడు. లంచ్ విరామానికి ముందు హేడెన్ పేరిట ఉన్న అత్యధిక స్కోరు (380) రికార్డు బద్దలైపోయింది. ఆరు నెలల కిందటే హేడెన్ లాక్కున్న తన రికార్డును మళ్లీ చేజిక్కించుకున్న ఆనందంలో లారా గాల్లోకి ఎగిరి సింహనాదం చేసిన దృశ్యాన్ని అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు. లంచ్ విరామానికి అతడి స్కోరు 390.
బ్రయాన్ 400 ముంగిట ఉన్నాడన్న వార్త క్రికెట్ ప్రపంచమంతా వ్యాపించి.. విరామ సమయం పూర్తయ్యే సమయానికి అభిమానులంతా టీవీల ముందు వాలిపోయారు. ఉత్కంఠ మొదలైంది. బాటీ వేసిన 202వ ఓవర్ రెండో బంతిని లెగ్ సైడ్ ఫ్లిక్ చేసి 400వ పరుగును పూర్తి చేశాడు బ్రయాన్. అంతే.. వ్యాఖ్యాత ఉద్వేగంతో ఊగిపోతూ.. బ్రయాన్ చార్లెస్ లారా మేడ్ హిస్టరీ అంటూ అతడి అద్భుత ఘనతను ప్రపంచానికి చాటాడు. లారా సెంచరీ కొట్టినా అదెంత అందంగా సాగుతుందో.. క్రీజులో లయబద్ధంగా కదులుతూ ఎలా షాట్లు ఆడతాడో తెలిసిందే. అలాంటిది 400 పరుగుల ఇన్నింగ్స్ అంటే.. అదెంతగా అలరించిందో చెప్పేదేముంది? క్రీజు వదిలి ముందుకు ఉరికి వస్తూ అతను ఆడిన ప్రతి లాఫ్టెడ్ షాట్ ఆణిముత్యమే. ముఖ్యంగా 400 మార్కును అందుకోవడానికి ముందు ఆడిన ఒక షాట్‌కు బంతి స్టేడియం పైకప్పును తాకింది.
ఇక అతడి ఆఫ్ సైడ్ ఆడిన కట్ షాట్ల అందమే అందం. హోగార్డ్, ఫ్లింటాఫ్, బాటీ, హార్మిసన్.. ఇలా ఏ బౌలర్‌నూ విడిచిపెట్టకుండా శిక్షించాడు బ్రయాన్. లారా 400 మార్కును అందుకున్న ఓవర్ పూర్తి కాగానే ఇన్నింగ్స్‌ను 751/5 వద్ద డిక్లేర్ చేశాడు. తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 285 పరుగులకే ఆలౌటైంది. ఇంకా ఒకటిన్నర రోజు సమయం ఉండటంతో మ్యాచ్ విండీస్ వశమవుతుందనుకున్నారు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ గొప్పగా పోరాడింది. ఓటమి తప్పించుకుంది. ఆట నిలిచే సమయానికి ఆ జట్టు 5 వికెట్లకు 422 పరుగులు చేసింది. లారా డిక్లరేషన్ ఆలస్యం చేశాడని.. 400 రికార్డు కోసం ఆడుతూ వెళ్లాడని.. వైట్ వాష్ తప్పించుకోవడానికి ఫ్లాట్ పిచ్ తయారు చేయించుకోవడం వల్లే రికార్డు అందుకున్నాడని కొన్ని విమర్శలు వచ్చాయి. కానీ లారా లాంటి మేటి బ్యాట్స్‌మన్ తన బ్యాటింగ్ నైపుణ్యమంతా చూపిస్తూ ఆడిన ఆ మారథాన్ ఇన్నింగ్స్‌ను మాత్రం క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ మరిచిపోదు.
నా రికార్డునే బద్దలు కొడతావా!
1958లో 365 పరుగుల ఇన్నింగ్స్‌తో అప్పటికి టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును అందుకున్నాడు వెస్టిండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్. ఈ రికార్డు ఏకంగా 36 ఏళ్ల పాటు నిలిచి ఉండటం విశేషం. 1994లో వెస్టిండీస్‌కే చెందిన బ్రయాన్ లారా దాన్ని బద్దలుకొట్టాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌లో 375 పరుగులతో కొత్త రికార్డు నెలకొల్పాడు. అయితే 2003 అక్టోబర్లో ఆస్ట్రేలియా ఓపెనర్ మాథ్యూ హేడెన్ జింబాబ్వేపై 380 పరుగులు చేసి లారా రికార్డును బద్దలు కొట్టాడు. కానీ పాపం.. ఆ రికార్డు ఆరు నెలలు మాత్రమే నిలిచింది. నా రికార్డునే అందుకుంటావా అన్నట్లుగా.. 2004 ఏప్రిల్లో లారా క్రికెట్ చరిత్రలోనే 400 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించిన తొలి ఆటగాడిగా అవతరించాడు. తిరిగి తన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇంతకుముందు 375 పరుగులు చేసిన ఇంగ్లాండ్ మీదే లారా 400 పరుగుల ఘనతనూ అందుకోవడం విశేషం. తర్వాత ఎవ్వరూ ఆ రికార్డును అందుకోలేకపోయారు.
బ్యాట్స్‌మన్ : బ్రయాన్ లారా
పరుగులు : 400 నాటౌట్
బంతులు : 582
బౌండరీలు : ఫోర్లు 43, సిక్సర్లు 4
ప్రత్యర్థి : ఇంగ్లాండ్
ఫలితం : మ్యాచ్ డ్రా
సంవత్సరం: 2004
ఇదీ చూడండి.. రిటైర్మెంట్ గురించి అప్పుడే చెప్పిన రోహిత్ శర్మ