చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కుటుంబంలా ఉంటుందని, ఇతరుల విజయాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారని వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో తెలిపాడు. "సీఎస్‌కే ప్రత్యేకమైన జట్టు. టీమ్‌తో కలిసి ఉన్నప్పుడు కుటుంబ వాతావరణంలా అనిపిస్తుంటుంది. సీఎస్‌కే జట్టు ప్రతి ఆటగాడు అలానే ఫీల్ అవుతాడు. జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు మెరుగవ్వడానికి కారణం యాజమాన్యమే. నాలో అత్యుత్తమ ఆటగాడిని సీఎస్‌కేనే వెలికితీసింది" అని బ్రావో అన్నాడు.
"సారథి ధోనీ, కోచ్ ఫ్లెమింగ్‌ను ఎంతో విశ్వసిస్తాను. వారు స్వేచ్ఛగా ఆడటానికి అవకాశం ఇస్తారు. వ్యక్తిత్వ ప్రదర్శనల కంటే జట్టు గెలుపే మాకు ముఖ్యం. ఇతరుల విజయాన్ని ఎంతో ఆస్వాదిస్తాం. చెన్నై జట్టులో ఉండే అనుకూల వాతావరణం మరే ఇతర జట్లలో ఉండదు. యాజమాన్యం, సారథి ఆటగాళ్లకు అండగా నిలవడం ఎంతో ముఖ్యం. ప్లేయర్లు విఫలమైనప్పుడు సీఎస్‌కే మరో అవకాశం ఇస్తుంటుంది" అని బ్రావో వెల్లడించాడు.
2011 నుంచి బ్రావో సీఎస్‌కేకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కరోనా కారణంగా మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 13వ సీజన్ వాయిదా పడింది.
ఇదీ చూడండి.. వచ్చే ఏడాదిలోనూ ఒలింపిక్స్ కష్టమే!