లాక్‌డౌన్ వేళ.. దేశవ్యాప్తంగా ఎక్కడా క్రికెట్ మ్యాచ్‌లు జరగట్లేదు. క్రికెటర్లు ప్రాక్టీస్ కూడా చేయట్లేదు. అలాంటి సమయంలో పంజాబ్‌లోని చండీగఢ్ సమీపంలోని ఓ పల్లెటూరిలో ఓ క్రికెట్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతోంది శ్రీలంకలో అన్నట్లుగా ప్రచారం చేశారు. ఉవా క్రికెట్ లీగ్ మ్యాచ్ పేరుతో దీన్ని ఆన్‌లైన్‌లో ప్రసారం కూడా చేశారు. అయితే ఈ మ్యాచ్‌తో తమకేమీ సంబంధం లేదని ఇటు భారత్, అటు శ్రీలంక క్రికెట్ బోర్డులు స్పష్టం చేశాయి. దీనిపై ఫిర్యాదుతో పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
చండీగఢ్‌కు 16 కిలోమీటర్ల దూరంలోని సవారా అనే గ్రామంలో జూన్ 29న ఉవా క్రికెట్ లీగ్ పేరుతో ఓ మ్యాచ్ జరిగినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీలంకలో ఉవా ప్రావిన్స్ క్రికెట్ సంఘం కేంద్రమైన దంబుల్లా నగరంలో ఈ మ్యాచ్ జరుగుతున్నట్లు ప్రచారం చేసుకున్న నిర్వాహకులు ఆ మ్యాచ్‌ను ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారం కూడా చేశారు. దీనిపై ఓ పత్రికలో కథనం రావడం వల్ల భారత్, శ్రీలంక బోర్డులతో పాటు పంజాబ్ పోలీసులూ అప్రమత్తమయ్యారు.
ఈ మ్యాచ్ గురించి తమకు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు అందగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు ఆరంభించామని.. పంకజ్ జైన్, రాజు అనే ఇద్దరు వ్యక్తుల్ని అరెస్టు కూడా చేశామని డీఎస్పీ ఖరార్ పాల్ సింగ్ మీడియాకు తెలిపారు. ఈ మ్యాచ్ ఎవరు, ఎలా నిర్వహించారో ఆరా తీస్తున్నామని బీసీసీఐ అవినీతి నిరోధక యూనిట్ చీఫ్ అజిత్ సింగ్ తెలిపాడు.
"ఇందులో ఎవరెవరి భాగస్వామ్యం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇది బీసీసీఐ అనుమతితో జరిగిన లీగ్ కాదు, బోర్డు గుర్తింపున్న క్రికెటర్లెవరూ ఇందులో పాల్గొనలేదు. కాబట్టి ఎవరి మీదా మేం చర్యలు తీసుకోలేం. బెట్టింగ్ జరిగినా, క్రిమినల్ అభియోగాలున్నా అది పోలీసుల పరిధిలోని విషయం"
-అజిత్ సింగ్, బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ చీఫ్
శ్రీలంక క్రికెట్ బోర్డు దీనిపై స్పందిస్తూ.. "ఉవా క్రికెట్ లీగ్‌లో భాగంగా దంబుల్లా స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతున్నట్లు స్కోర్ కార్డుతో సహా కొన్ని భారత వెబ్‌సైట్లు పేర్కొన్నాయి. శ్రీలంకలో ఈ పేరుతో ఎలాంటి లీగ్ జరగట్లేదు. దీనిపై విచారణకు ఆదేశించాం" అని పేర్కొంది. తమ క్రికెట్ సంఘం కొన్నేళ్లుగా ఏమంత చురుగ్గా లేదని.. దీని అవకాశంగా మలుచుకుని తమ పేరును వాడుకున్నారని ఉవా ప్రావిన్స్ క్రికెట్ సంఘం ప్రతినిధి భగీరథ్ వివరణ ఇచ్చాడు.