కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఓ రోజులో ఉదయం పూట టెస్టు, మధ్యాహ్నం వన్డే ఆడే పరిస్థితులు టీమిండియాకు రానున్నాయని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ఈ వైరస్ వల్ల మ్యాచ్లు వాయిదా పడిన నేపథ్యంలో, బోర్డుకు ఏర్పడిన ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అయితే ఈ మ్యాచ్ల కోసం రెండు వేర్వేరు జట్ల ఉండనున్నాయని తెలిపారు.
"అంతర్జాతీయ మ్యాచ్లు మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో మాకు కచ్చితంగా తెలియదు. అలాంటి ఈ సమయంలో స్పాన్సర్స్కు భరోసా కల్పించాలంటే ఉన్న ఒకే ఒక ఆప్షన్.. టీమిండియాకు సంబంధించి రెండు జట్లను తయారు చేసి.. వారితో టెస్టు, టీ20 సిరీస్లను ఏకకాలంలో జరపాలి" -బీసీసీఐ అధికారి
గతంలో ఇదే తరహాలో 2017 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా రెండు జట్లతో ఆడింది. శ్రీలంకతో స్వదేశంలో ఓ జట్టు టీ20 సిరీస్ ఆడగా, భారత్లో టీమిండియాతో బోర్డర్-గావస్కర్ టెస్టు సిరీస్లో మరో జట్టు తలపడింది.
ప్రాణాంతక కరోనా వల్ల మార్చి నుంచి క్రికెట్కు సంబంధించిన అన్ని కార్యకలాపాలు మనదగ్గర నిలిచిపోయాయి. లాక్డౌన్ వల్ల అదే నెల చివరి నుంచి జరగాల్సిన ఐపీఎల్.. నిరవధిక వాయిదా పడింది. ఒకవేళ టోర్నీ.. ఈ ఏడాదిలో జరగకపోతే బోర్డుకు దాదాపు రూ.4000 కోట్లు ఉంటుందని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ ఇటీవలే చెప్పారు. దీనితో పాటే వైరస్ ప్రభావంతో ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన, టీ20 ప్రపంచకప్ నిర్వహణపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.