అక్టోబరులో బంగ్లాదేశ్.. శ్రీలంక పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సిరీస్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వాయిదా వేసింది. ఈ విషయాన్ని సోమవారం ఓ అధికారిక ప్రకటన ద్వారా ఐసీసీ తెలియజేసింది.
సిరీస్ ప్రారంభమయ్యే ముందు ఆటగాళ్లు నిర్బంధానికి సంబంధించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ), శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) మధ్య ఏకాభిప్రాయం రాకపోవడమే కారణమని తెలుస్తోంది. పర్యటనలో బంగ్లా క్రికెటర్లు 14 రోజుల నిర్బంధంలో కచ్చితంగా ఉండాలనే శ్రీలంక ఆరోగ్య నియమాలకు బీసీబీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
"శ్రీలంకకు వెళ్లే పర్యాటకులు ఆరోగ్య నిబంధనల ప్రకారం కచ్చితంగా 14 రోజుల పాటు నిర్బంధంలో ఉండాలి. అయితే ఈ విషయంలో శ్రీలంక క్రికెట్ బోర్డు ఏమీ చేయలేమని చెప్పింది. ఈ నేపథ్యంలో పరిస్థితులు మెరుగుపడిన తర్వాత సిరీస్ నిర్వహిద్దామని తెలియజేశాం. వారి ఆరోగ్య నియమాలను పాటిస్తూ మేము ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఆడలేం. వారు మేం చెప్పినదాంట్లో 14 రోజుల నిర్బంధం మినహా మిగిలిన అన్నింటికి అంగీకరించారు."
- నజ్ముల్ హసన్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు
వచ్చే నెలలో ఐసీసీ ప్రపంచటెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య మూడు టెస్టులు జరగాల్సిఉంది.