ఈ ఏడాది టీమిండియా ఆడనున్న తొలి టీ20లో ఫ్లకార్డులు ప్రదర్శించాలనుకున్న అభిమానులకు నిరాశే కలగనుంది. గువహటి వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో పోస్టర్లు, బ్యానర్ల ప్రదర్శనకు అనుమతివ్వలేదు అసోం క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ). భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఏసీఏ సెక్రటరీ దేవాజిత్ సాయికియా చెప్పారు.
"ఏది ఏమైనప్పటికీ మేము భద్రతా నిబంధనలను పాటించాల్సిందే. ఇందులో ఎవరు ఎక్కువ కాదు.. తక్కువ కాదు. ఎట్టిపరిస్థితుల్లో ఈ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ, ఏసీఏ భావిస్తున్నాయి. ఇందుకోసం నెల నుంచి సన్నాహాలు చేశాం. ఆదివారం అభిమానులను ఉల్లాసపరిచేలా డీజే, ఫైర్వర్క్తో మ్యాచ్ను విజయవంతంగా నిర్వహిస్తాం. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు." -దేవాజిత్ సాయికియా, ఏసీఏ సెక్రటరీ
గువహటి బార్సపారా స్టేడియంలోకి బౌండరీ పోస్టర్లు(ఫోర్, సిక్సర్) కూడా అనుతించమని దేవాజిత్ తెలిపారు. పురుషుల వాలెట్లు, మహిళల హ్యాండ్బ్యాగులు, ఫోన్లు, వాహనాల తాళం చెవులు మాత్రమే వెంట తీసుకెళ్లే వెసులుబాటు కల్పించామని చెప్పారు.
ఈ నెల 5న గువహటి వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. 7న ఇండోర్, 10న పుణె వేదికగా ఆఖరి టీ20 నిర్వహించనున్నారు.
జట్లు
భారత్:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), మనీశ్ పాండే, సంజు శాంసన్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, చాహల్, కుల్దీప్ యాదవ్, శార్దుల్ ఠాకూర్, నవదీప్ సైనీ, జస్ప్రీత్ బుమ్రా.
శ్రీలంక:
లసిత్ మలింగ (కెప్టెన్), దనుష్క గుణతిలక, అవిష్క ఫెర్నాండో, ఏంజెలో మాథ్యూస్, దసన్ శనక, కుశాల్ పెరీరా, నిరోషన్ డిక్వెలా, ధనంజయ డి సిల్వా, ఇసురు ఉదాన, భానుక రాజపక్స, ఒషాద ఫెర్నాండో, వనిందు హసరంగ, లాహిరు కుమార, కుశాల్ మెండిస్, లక్షణ్ సందకన్, కసున్ రజిత.
ఇదీ చదవండి: 'టీమిండియా పేస్ విభాగం అత్యద్భుతంగా ఉంది'