ఆస్ట్రేలియా జట్టు వైస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఉత్తమ ఫినిషర్లలో మాహీ ఒకరని పేర్కొన్నాడు. అటువంటి ఆటగాడి కోసం ఆసీస్ జట్టు ఎదురు చూస్తోందని తెలిపాడు. దాదాపు 400 మ్యాచ్లు అడిన అనుభవం ఉన్న ధోనీ మిడిలార్డర్ పరంగా మంచి పట్టు ఉన్న ఆటగాడని వివరించాడు.
"ఏ జట్టులోనైనా మిడిలార్డర్ పాత్ర ఎంతో కష్టతరమైందని అందరూ అంటారు. దాన్ని మేం కూడా గుర్తించాం. మా జట్టుకు దోనీ లాంటి ఫినిషర్ కావాలి. దాదాపు 300-400 వన్డే మ్యాచ్లు ఆడిన ధోనీ.. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు. అటువంటి ఆటగాడి కోసం పరిశీలిస్తున్నాం. ఒక్క రాత్రిలోనే ఇదంతా జరగదని మాకు తెలుసు. మంచి ప్లేయర్ని గుర్తించి వారికి సమయం ఇవ్వాలి."
-ప్యాట్ కమిన్స్, ఆసీస్ వైస్ కెప్టెన్
కరోనా కారణంగా ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ బయోసెక్యూర్ వాతావరణంలో జరిగింది. దీనిపై స్పందించిన కమిన్స్.. ఇది ఎంతో విచిత్రమైన అనుభవమని అన్నాడు. ఆదివారం జరిగే రెండో టీ20 కోసం సిద్ధమవుతున్నామని తెలిపిన అతడు.. ఈ మ్యాచ్లో తప్పకుండా గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.