ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో టీమ్ఇండియా ఓటమిపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. వరుసగా రెండు పరాజయాలు ఎదురైన నేపథ్యంలో కోహ్లీ కెప్టెన్సీపై విమర్శలు చేశాడు. స్టార్ పేసర్ బుమ్రాకు విరాట్, కొత్త బంతితో కేవలం రెండే ఓవర్లు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
"రెండో వన్డేలో కోహ్లీ కెప్టెన్సీ నాకు అర్థమే కాలేదు. ఆస్ట్రేలియా లాంటి బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పుడు ప్రధాన బౌలర్ బుమ్రాకు రెండు ఓవర్లే ఇవ్వడం ఏంట? సాధారణంగా ఓ బౌలర్‌కు 4-3-3 తరహాలో బౌలింగ్ ఇవ్వొచ్చు. లేదా గరిష్ఠంగా 4 ఓవర్ల వరకు బౌలింగ్ చేయించవచ్చు. కానీ, బుమ్రాకు కేవలం రెండు ఓవర్లే బౌలింగ్ ఇవ్వడం వల్ల కెప్టెన్సీ ఎలాంటిదో నేను అర్థం చేసుకోగలను. దానిని నేను అసలు వివరించలేను. ఇది టీ20 కాదు. నిజం చెప్పాలంటే ఇలాంటి కెప్టెన్సీని అస్సలు అంచనా వేయలేకపోతున్నాను"
- గౌతమ్ గంభీర్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
టీమ్ఇండియాలో ఆరో బౌలర్‌గా వాషింగ్టన్ సుందర్ లేదా శివమ్ దూబెలను ఎంపిక చేయాలని గంభీర్ సూచించాడు. "టీమ్ఇండియాలోని ఆరో బౌలర్కుగా సుందర్ లేదా దూబెలలో ఒకరికి అవకాశం ఇచ్చి, పరిశీలించాలి. ఒకవేళ జట్టులో వాళ్లలో ఎవరైనా లేకపోతే అది సెలక్షన్ కమిటీ తప్పిదమే అవుతుంది. ఇలాంటి పరిశీలనలు జరగపోతే అంతర్జాతీయ స్థాయిలో సరైన ఎంపిక చేయలేరు. ఇలాంటి మార్పులు చేయడం వల్ల ఆస్ట్రేలియాను దెబ్బతీసే అవకాశం ఉంటుంది" అని గౌతీ అన్నాడు. మరోవైపు పరిమిత ఓవర్ల ఫార్మాట్లో కోహ్లీ సరిగా ఆడకపోవడం వల్ల రోహిత్‌శర్మను కెప్టెన్‌గా పరిశీలించాలని అభిప్రాయపడ్డాడు.
ఇదీ చూడండి: 'ఇప్పటికైనా రోహిత్‌కు టీ20 బాధ్యతలు అప్పగించండి'