రిటైర్మెంట్కు రోజులు దగ్గరపడుతున్న కారణంగా, క్రమశిక్షణతో బ్యాటింగ్ చేయడాన్ని అలవాటు చేసుకుంటున్నానని ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ చెప్పాడు. తనలోని దూకుడు స్వభావాన్ని క్రమంగా మార్చుకుంటున్నట్లు తెలిపాడు. ఎవరైనా తనపై మాటల యుద్ధానికి దిగితే.. వారికి బ్యాట్‌తోనే సమాధానం చెబుతానని అన్నాడు.
"ఈ మధ్యే 34వ వసంతంలోకి అడుగుపెట్టాను. వయసు కూడా పెరిగిపోతుంది. రిటైర్మెంట్కు రోజులు దగ్గరపడుతున్నాయి. గతంలో మైదానంలో చాలాసార్లు మాటల యుద్ధానికి దిగిన సందర్భాలున్నాయి. కాలక్రమేణా మేం అన్ని నేర్చుకుంటున్నాం. అలాంటి వాటిని పట్టించుకోకుండా వెళ్లిపోవడం మంచిదని గ్రహించాను. స్లెడ్జింగ్ చేయకుండా బ్యాట్‌తో సమాధానం చెప్పడం సరైన పద్ధతని భావించాను. నేను నేర్చుకున్నది ఇదే. ఈ విషయం మన సహచరులపై ప్రభావం చూపిస్తుంది"
- డేవిడ్ వార్నర్, ఆస్ట్రేలియా ఓపెనర్
టీమ్ఇండియాతో జరగబోయే వన్డే సిరీస్ గురించి కూడా వార్నర్ మాట్లాడాడు. "వన్డేల్లో మంచి ఓపెనింగ్ చేయడం సహా మధ్య ఓవర్లలో దూకుడుగా ఆడటం చాలా ముఖ్యం. మంచి స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేస్తున్నాను. గతేడాది టెస్టులోనూ క్రమశిక్షణతో ఇన్నింగ్స్ ఆడానని భావిస్తున్నాను. చివరి 12-24 నెలల్లో నా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. చాలా క్రమశిక్షణ అలవాటు చేసుకున్నాను. వయసు పెరుగుతున్న కొద్దీ ఇలాంటివి నేర్చుకోవడం వల్ల ఆటలో అత్యున్నత స్థాయికి చేరుతారు" అని అన్నాడు.
రోహిత్ లేకపోయినా..
వన్డే, టీ20ల్లో టీమ్ఇండియా వైస్‌కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంపై డేవిడ్ వార్నర్ స్పందించాడు. "జట్టులో అనుభవజ్ఞుడైన ఆటగాడు రోహిత్ లేకపోయినా.. మంచి ఫామ్‌లో ఉన్న క్రికెటర్లు ఉన్నారు. కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్‌లు ఐపీఎల్లో అద్భుతంగా ఆడారు. టెస్టు వైస్‌కెప్టెన్ అంజిక్య రహానె ప్రశాంతంగా ఆడుతూ.. తాను అనుకున్నది చేస్తాడు" అని చెప్పాడు.