రికార్డుల గురించి ఆలోచించడం ఎప్పుడో మానేశానని టీమ్‌ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. జట్టుకు ఆడుతున్నప్పుడల్లా తన వంతు పాత్ర పోషించేందుకే కృషి చేస్తానని పేర్కొన్నాడు. కుంబ్లే 619 వికెట్ల రికార్డు బద్దలు కొడతారా అని ప్రశ్నించగా 'అదింకా 218 వికెట్ల దూరంలో ఉంది' అని యాష్ బదులిచ్చాడు.
"ఒక వ్యక్తిగా, క్రికెటర్‌గా మరింత మెరుగయ్యేందుకే నేను ప్రయత్నిస్తాను. నేను చాలా సంతోషంగా ఉండేందుకు, ఆటను ఆస్వాదించేందుకు అదే కారణమని అనుకుంటాను. 15 ఏళ్లుగా ఇదే చేశాను. ఇప్పుడూ చేస్తాను. ఇక గులాబీ టెస్టుల విషయానికి వస్తే.. ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు."
-రవిచంద్రన్ అశ్విన్, భారత స్పిన్నర్.
"ఆస్ట్రేలియా పర్యటనలో నా కుటుంబం నాతోనే ఉంది. ఐపీఎల్ రెండో అర్ధభాగంలోనూ ఉన్నారు. ప్రస్తుతం రొటేషన్ విధానంలో భాగంగా వారిని ఇంటికి పంపించేశాను. ఎందుకంటే వారికి విరామం అవసరం. అయితే బయో బబుల్ వల్ల టీం సభ్యుల మధ్య అనుబంధం మరింత పెరిగింది. బుడగలో ఒంటరితనం వేధిస్తుంది. నేనైతే ఆన్‌లైన్‌లో ఏవైనా చూస్తాను. పుస్తకాలు చదువుతాను. యోగా, ధ్యానం చేస్తుంటాను." అని అశ్విన్ పేర్కొన్నాడు.
గులాబీ టెస్టుకు ఉపయోగించిన పిచ్ మంచిదేనా అని ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఘాటుగా జవాబిచ్చాడు.
"నేనో ప్రశ్న అడుగుతాను. మంచి వికెట్ అంటే ఏంటి? దానిని ఎవరు నిర్వచిస్తారు? తొలిరోజు సీమ్‌కు సహకరించి తర్వాత బ్యాటింగ్‌కు అనుకూలించి చివరి రెండు రోజుల్లో స్పిన్ తిరిగితే మంచిదా? వీటి నుంచి బయటపడాలి. ఎవరు పెట్టారు ఈ నిబంధనలు? మంచి పిచ్ గురించి మీరడిగితే ఇంగ్లాండ్‌లో ఏ ఆటగాడూ పిచ్‌తో ఇబ్బంది పడ్డట్టు అనిపించలేదు. వారు మరింత మెరుగవ్వాలని అనుకుంటున్నారు" అని యాష్ చెప్పాడు.
మరి నాలుగో టెస్టుకూ ఇదే తరహా పిచ్ ఉంటుందా అని ప్రశ్నించగా "బరిలోకి దిగాక కానీ తెలియదు కదా" అని బదులిచ్చాడు.
ఇదీ చదవండి: ఇండియా- ఇంగ్లాండ్ చివరి టెస్టుకు బ్యాటింగ్ పిచ్!