2004 డిసెంబరు 26న మనదేశంలో వచ్చిన సునామీ.. దక్షిణాది రాష్ట్రాల్ని అల్లకల్లోలం చేసేసింది. ఈ విపత్తు సమయంలో తాను చెన్నైలో ఉన్నానని, కొద్దిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని టీమ్ఇండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే చెప్పాడు. స్పిన్నర్ అశ్విన్‌తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు.
"నా భార్య, కుమారుడితో కలిసి అప్పుడు చెన్నైకి విహారయాత్రకు వెళ్లాను. సునామీ వచ్చిన రోజే అక్కడ నుంచి మేం బయలుదేరాం. ఆ రోజు ఉదయం 11.30 గంటలకు విమానం. అయితే ముందుగానే అక్కడ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. హోటల్ నుంచి 9.30 గంటలకే బయలుదేరాం. ముందురోజు రాత్రి నా భార్య నిద్ర పట్టడం లేదని చెప్పడం వల్ల ఉదయం త్వరగానే మేల్కొన్నాం. మొదటి అల తాకిడి సమయానికి మేం అల్పాహారం తింటున్నాం. అప్పుడు ఏం జరుగుతుందో నాకైతే అర్థం కాలేదు"
-అనిల్ కుంబ్లే, టీమ్ఇండియా మాజీ స్పిన్నర్
తాను హోటల్ నుంచి బయలుదేరినప్పుడు పరిణామాన్ని అర్థం చేసుకోలేకపోయినా, చుట్టుపక్కల ఉన్న ప్రజల ముఖాల్లో భయాందోళనలను చూశానని అన్నాడు కుంబ్లే. "ఆ సమయంలో ఏం చేయలేకపోయాను. బయటకు వెళ్లి కారులో కూర్చున్నా. దగ్గర్లోని వంతెనకు అడుగు దిగువన నీరు ప్రవహిస్తుంది. సినిమాల్లో చూపించే విధంగా ప్రజలు తమ సామాన్లతో, భుజాలపై సంచులు వేసుకుని నడుచుకుంటూ వెళ్తున్నారు. మా డ్రైవర్ ఎవరికో ఫోన్ చేస్తూనే ఉన్నాడు. నేను బెంగళూరుకు తిరిగి వచ్చిన తర్వాత టీవీ పెట్టి చూస్తే అది సునామీ అని అర్ధమైంది. ప్పటి వరకు ఏమి జరిగిందో నాకు అర్థం కాలేదు" అని అశ్విన్‌కు కుంబ్లే తెలిపాడు.
చీకటి రోజు
2004 డిసెంబరు 26.. దక్షిణ భారతదేశంతో పాటు పొరుగు దేశాలకు వినాశకరమైన రోజు. హిందూ మహాసముద్రంలో సునామీ వల్ల ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో అధికారికంగా 10,136 మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.