పాక్ లెఫ్టార్మ్ పేసర్ మహ్మద్ ఆమిర్.. 27 ఏళ్లకే టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించి సంచలనం సృష్టించాడు. ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన బౌలర్లలో ఒకడైన ఈ ఆటగాడు.. మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. బ్రిటన్‌లో ఉండేందుకు ఆ దేశ పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్ నివాసిగా మారేందుకు ఆమిర్ ప్రణాళికలు వేసుకొంటున్నట్లు పాక్‌కు చెందిన ఓ వెబ్సైట్ కథనం ప్రచురించింది. ప్రస్తుతం లండన్‌లో ఇల్లు కొనే పనిలో ఉన్నట్లు రాసుకొచ్చింది.
భార్య లండన్ భామ
2016లో ఆమిర్.. బ్రిటన్ వాసి నర్గీస్ మాలిక్‌ను వివాహమాడాడు. భార్యతో పాటు ఉండేందుకు స్పౌస్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ వీసాతో రెండున్నరేళ్ల పాటు ఇంగ్లాండ్‌లో ఉండేందుకు అనుమతి ఉంది. ఈ సమయంలో బ్రిటీష్ పౌరసత్వం లభిస్తే ఆమిర్ కెరీర్‌కు చాలా లాభం కలగనుంది. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడే అవకాశం లభిస్తుంది. గతంలో అతడి వద్ద బ్రిటన్ పాస్‌పోర్ట్ ఉండేది. 2010లో లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆమిర్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. ఆ కేసు విచారణ సమయంలో అతడి పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకున్నారా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు.
ఐపీఎల్లో ఛాన్స్..?
2008లో ముంబయిలో ఉగ్రదాడి తర్వాత పాక్ ఆటగాళ్లకు వీసాలు ఇవ్వడానికి నిరాకరించింది బీసీసీఐ. ఇప్పటికీ పాకిస్థాన్ ఆటగాళ్లకు ఐపీఎల్లో ఆడే అవకాశం లేదు. ప్రస్తుతం ఆమిర్ పాకిస్థాన్‌లో ఆడినా పెద్దగా అభివృద్ధి చెందట్లేదని భావించి.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీ20 లీగ్‌ల్లో ఆడాలన్న ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే బ్రిటన్‌లో శాశ్వత నివాసం ఏర్పరచుకొంటే అక్కడ పాస్‌పోర్ట్‌తో పాటు పౌరసత్వం లభించే అవకాశాలున్నాయి. ఫలితంగా ఐపీఎల్లో ఆడేందుకూ ఛాన్స్ ఉంటుంది.