2010లో లార్డ్స్ టెస్టు సందర్భంగా బయటపడ్డ పాకిస్థాన్ క్రికెటర్ల స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం ప్రపంచ క్రికెట్‌ను షాక్‌కు గురిచేసింది. ఇందులో దోషులుగా తేలిన సల్మాన్ బట్, మహ్మద్ ఆసిఫ్, మహ్మద్ ఆమిర్ నిషేధానికి గురయ్యారు. అయితే ఈ కుంభకోణానికి ముందు తమ ఆటగాళ్లకు, బుకీ మజీద్‌కు మధ్య సంక్షిప్త సందేశాలు నడిచాయని... ఆ సంగతి తనకు ముందే తెలుసని అఫ్రిది తన ఆత్మకథ ‘గేమ్ చేంజర్’లో వెల్లడించాడు.
ఆటగాళ్లకు ఏజెంట్‌గా వ్యవహరించిన మజీద్ ఫోన్ పాడైతే లండన్‌లో రిపేర్ కోసం ఇచ్చాడని... అయితే ఆ షాపు యజమానికి తనతో పరిచయం ఉండటంతో అందులోని కీలక సందేశాలు తనకు పంపించాడని వెల్లడించాడు. తమ జట్టులోని ఆటగాళ్లతో ఫిక్సింగ్ గురించి మజీద్ చర్చిస్తున్న సంగతి అప్పుడే తనకు అర్థమైందని అఫ్రిది చెప్పాడు. ఆ విషయం కోచ్ వకార్ యూనిస్‌కు చేరవేస్తే.. అతను ఉన్నతాధికారులకు నివేదించలేకపోయాడని అన్నాడు. చివరికి విషయం అంత తీవ్రతరమౌతుందని ఊహించలేదని వెల్లడించాడు అఫ్రిది.