ఈ ఐపీఎల్లో వేడి, తేమ లాంటి వాతావరణ పరిస్థితులకు అలవాటుపడటమే ఫ్రాంచైజీలకు అతిపెద్ద సవాలు అని స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అభిప్రాయడ్డాడు. లీగ్లో ఎక్కువ మ్యాచ్లు రాత్రి పూట జరగనున్నాయి. అయినప్పటికీ అక్కడి వాతావరణాన్ని తట్టుకోవడం అంత సులభం కాదని పేర్కొన్నాడు. బెంగళూరుకు ఆడనున్న డివిలియర్స్, ఫ్రాంఛైజీ పోస్ట్ చేసిన వీడియోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
"ఇలాంటి వాతారణం నాకు అలవాటు లేదు. చాలా వేడిగా ఉంది. ఒకసారి జులైలో చెన్నైలో ఆడిన ఓ టెస్టు మళ్లీ గుర్తొస్తోంది. అప్పుడు సెహ్వాగ్ 300 పరుగులు చేశాడు. ఆ సమయంలో ఉన్న వేడిని నా జీవితంలో మర్చిపోలేను. యుఏఈకి వచ్చే ముందు కొన్ని నెలల వాతావరణ పరిస్థితులను పరిశీలించాను. అంతా బాగానే ఉందనిపించింది. కచ్చితంగా ఆటపై ఈ ప్రభావం పడుతుంది"
ఏబీ డివిలియర్స్, ఆర్సీబీ క్రికెటర్
మరోవైపు కరోనా ప్రభావంతో ప్రేక్షకులు లేకుండానే లీగ్ నిర్వహించడంపై డివిలియర్స్ స్పందించాడు. "స్టేడియంలో భారీ జన సమూహం మధ్య ఆడటానికి క్రికెటర్లంతా అలవాటుపడ్డారు. కచ్చితంగా వారి మద్దతుతో ఆటగాళ్లకు మరింత హుషారు వస్తుంది. ముఖ్యంగా చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఫ్యాన్స్ ఉత్సాహం చూస్తే.. జట్టును ఆపడం చాలా కష్టమని అనిపిస్తుంది. కాబట్టి, ప్రేక్షకులను మిస్ అవుతున్నామనడంలో ఎలాంటి సందేహం లేదు" అని ఏబీ డివిలియర్స్ చెప్పాడు.