ఢాకా వేదికగా జరిగిన ఆసియన్ క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ఎమర్జింగ్ టీమ్స్ కప్లో పోరాడి ఓడిపోయింది భారత జట్టు. బుధవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో.. ఇరుజట్లు హోరాహోరీగా తలపడ్డాయి. కానీ ఆఖరి ఓవర్లో 8 పరుగులు కొట్టలేకపోయారు భారత ఆటగాళ్లు. ఫలితంగా 3 పరుగుల తేడాతో గెలిచింది పాక్ జట్టు.
తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ ... 7 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. ఒమిర్ యూసఫ్(66), హైదర్ అలీ (43) పరుగులు చేసి మంచి శుభారంభం ఇచ్చారు. ఆ తర్వాత మిగతా ఆటగాళ్లలో సైద్ బాదర్(47*), రోహిత్ నజీర్(35), ఇమ్రాన్ రఫీక్(28) రాణించి భారత్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. భారత బౌలర్లలో శివమ్ మావి, హృతిక్ షోకీన్, సౌరభ్ దూబే తలో రెండేసి వికెట్లు తీసుకున్నారు.
268 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్.. 8 వికెట్లు కోల్పోయి 264 పరుగులే చేయగలిగింది. రవి శరత్(47), సాన్వీర్ సింగ్(76), అర్మాన్ జాఫర్(46) మంచి ప్రదర్శన చేసినా.. ఆఖర్లో బ్యాట్స్మన్లంతా వరుసగా ఔటయ్యారు. చివరి ఓవర్ బౌలింగ్ చేసిన అమద్ భట్ నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు.
మరో సెమీఫైనల్లో అఫ్గాన్, బంగ్లా జట్లు తలపడనున్నాయి. ఇందులో విజేతతో పాకిస్థాన్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.