ఆస్ట్రేలియాలో వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లో ఏబీ డివిలియర్స్‌ను తీసుకుంటామని దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ క్వింటన్ డికాక్ స్పష్టం చేశాడు. దీంతో మిస్టర్ 360 డిగ్రీ ఆటగాడి పునరాగమనంపై సందిగ్ధత వీడింది. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఏబీడీ టీ20 ప్రపంచకప్‌లో ఆడేందుకు ఆసక్తి కనబరిచాడు. అయితే ఈ ఏడాది అక్టోబర్‌లో జరగాల్సిన ప్రపంచకప్ కరోనా కారణంగా వచ్చే ఏడాది అక్టోబర్-నవంబర్‌లో జరుపనున్న విషయం తెలిసిందే.
"టీ20 ప్రపంచకప్ జట్టు ఎంపికలో డివిలియర్స్ మా ప్రతిపాదనల్లో ఉంటాడు. అతడు ఫిట్‌గా ఉంటే కచ్చితంగా తీసుకుంటాం. ఏ జట్టయినా డివిలియర్స్ లాంటి ఆటగాడిని తీసుకోవడానికి ఇష్టపడుతుంది. టీ20 ప్రపంచకప్ ఎప్పుడు జరగబోతోందో వేచి చూడాలి."
-డికాక్, దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్
ఈ ఏడాది జనవరిలోనే దక్షిణాఫ్రికా క్రికెట్ అసోసియేషన్ డుప్లెసిస్‌ను తొలగించి డికాక్‌ను టీ20 జట్టు కెప్టెన్‌గా ఎన్నుకుంది. ఆ దేశ క్రికెట్ డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్‌ను టెస్ట్ కెప్టెన్సీకి ఎన్నుకోలేమని ఏప్రిల్‌లో ప్రకటించాడు. అధిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుందని టెస్టు సారథిగా ఉండేందుకు డికాక్ కూడా సుముఖత చూపలేదు. వికెట్ కీపర్‌గా ఉంటూ, ఓపెనింగ్ చేస్తూ మూడు జట్లకు కెప్టెన్సీ వహించడం ఒత్తిడితో కూడుకున్న పని అని అన్నాడు. మూడు జట్లను నడపడం నావల్ల కాదన్నాడు. టీ20, వన్డేలతో చాలా సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నాడు.