బ్రిస్బేన్‌లో జరగబోయే నాలుగో టెస్టు ముందు ఆసీస్-భారత్ ఆటగాళ్లు క్వారంటైన్ వంటి కఠిన నియమావళిని పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనల్లో సవరణలు చేయాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు తాజాగా విజ్ఞప్తి చేసింది బీసీసీఐ. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియాకు ఓ లేఖను పంపింది.
"క్వారంటైన్ నియమావళిలో సవరణలు చేసే విషయమై ఇప్పటివరకు చర్చలు జరిగాయి. అయితే ఈ రోజు ఇదే విషయమై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు అధికారికంగా లేఖను పంపాం. ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చాక రెండు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు క్వారంటైన్లలో ఉండాలని ముందుగా మేము ఎటువంటి ఒప్పందం చేసుకోలేదు. ఇప్పటికే సిడ్నీలో ఓసారి క్వారంటైన్లో ఉన్నాం. మా డిమాండ్ చాలా సింపుల్. ఐపీఎల్‌ను నిర్వహించిన బయోబుడగలో ఎటువంటి నిబంధనలను పెట్టామో అలాంటి నిబంధనలే ఈ క్వారంటైన్‌లోనూ ఉండాలని అడిగాం. మొత్తంగా ఐపీఎల్ నిర్వహించిన బయోబుడగ తరహా వాతావరణంలో నాలుగో టెస్టును నిర్వహించాలని కోరాం. క్వారంటైన్ సమయంలో ఆటగాళ్లు స్నేహపూర్వకంగా కలిసి, మాట్లాడుకునే విధంగా ఉండాలి. హోటల్ లోపల మా ఆటగాళ్లు కలిసి మెలిసి భోజనం చేయాలనుకుంటారు. కానీ ఆసీస్ బోర్డు మాత్రం ఒక్క ఫ్లోరుకు చెందిన ఆటగాళ్లు మాత్రమే కలిసి ఉండాలని, రెండు వేరు వేరు ఫ్లోర్లకు చెందిన ఆటగాళ్లు కలవకూడదని అంటోంది. ఇవి చాలా కష్టంతో కూడుకున్నవి."
-బీసీసీఐ ఉన్నతాధికారి.
అంతకుముందు సిడ్నీలో ఉన్న క్వారంటైన్ నిబంధనలపై తాత్కాలిక సారథి అజింక్యా రహానె అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇలాంటి రూల్స్ వల్ల ఆటగాళ్లపై ఒత్తిడి పెరుగుతుందని చెప్పాడు. కాగా, జనవరి 15 నుంచి 19వరకు నాలుగో టెస్టు జరగనుంది.
ఇదీ చూడండి : 'నాలుగో టెస్టు బ్రిస్బేన్‌లోనే నిర్వహించాలి'