సేన దేశాలుగా పిలిచే సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో పిచ్‌లు విభిన్నంగా ఉంటాయి. ఇంగ్లీష్ గడ్డపై మైదానాలు స్వింగ్, సీమ్‌కు అనుకూలిస్తే.. కంగారూ గడ్డపై పేస్, బౌన్స్ పిచ్‌లు ఉంటాయి. ఇక న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలో పొడిగా ఉండే పిచ్‌లు ఉంటాయి. ఇవి బ్యాట్స్‌మన్ సహనాన్ని పరీక్షిస్తాయి. ఈ మైదానాల్లో పరుగులు రాబట్టడం అంత సులభమేమి కాదు. వాతావరణం, పిచ్ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతుండటం వల్ల ఆటగాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటారు.
అయితే ఇలాంటి మైదానాల్లో ఎప్పుడూ బౌలింగ్ విభాగాన్ని ప్రధానంగా నమ్ముకుని జట్టును నడిపించారు ధోనీ, విరాట్ కోహ్లీ. విదేశాల్లో మంచి విజయాలు ఖాతాలో వేసుకున్నారు. అయితే బ్యాటింగ్‌కు ఇబ్బందులు పడే ఈ పిచ్‌లపై తమదైన ప్రదర్శనతో రాణించి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'లు అందుకున్నా వారిలో భారత్ నుంచి కేవలం ముగ్గురే ఉన్నారు.
రోహిత్ శర్మ
భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు విదేశీ గడ్డపై మంచి రికార్డులు ఉన్నాయి. బలమైన ప్రత్యర్థులపై ఇంకా అద్భుతంగా ఆడతాడు హిట్‌మ్యాన్. అందుకే ఈ సేన దేశాలన్నింటిలో 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్న ఆటగాళ్లలో ఒకడిగా ఘనత సాధించాడు.
గత మూడేళ్లలో ఇంగ్లాండ్‌లో 5 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'లు అందుకున్నాడు రోహిత్. ఇందులో నాలుగు అవార్డులు 2019 ప్రపంచకప్లోనివే. ఆస్ట్రేలియాలో 2 అవార్డులు(బంగ్లాదేశ్, 2015 ప్రపంచకప్), న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలోనూ ఒక్కోసారి అవార్డు దక్కించుకున్నాడు.
ఈ తొమ్మిది అవార్డుల్లో ఒకటి అత్యధిక స్కోరు చేసినందుకు అందుకున్నాడు. మాంచెస్టర్ వేదికగా పాక్‌తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో రోహిత్ శతకంతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతమున్న క్రికెటర్లలో సేన దేశాలన్నింటిలో అవార్డులు పొందిన ఏకైక క్రికెటర్‌గానూ ఘనత సాధించాడు.
కపిల్ దేవ్..
భారత మాజీ క్రికెటర్, టీమ్ఇండియా మాజీ సారథి కపిల్‌దేవ్ కూడా ఈ నాలుగు దేశాలపై అద్భుత ప్రదర్శన చేసి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'లు అందుకున్నాడు. ఈ హరియాణా పేసర్ ఆల్‌రౌండర్‌గా విదేశాల్లో రాణించాడు. ఓవర్సీస్లో మొత్తం 140 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం ఎనిమిది అవార్డులు అందుకున్నాడు కపిల్. ఇందులో రెండు ఆస్ట్రేలియాపై సాధించాడు. 1983 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌లోని టన్‌బ్రిడ్జ్ వేదికగా జింబాబ్వేతో మ్యాచ్ జరిగింది. ఈ పోరులో 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు కపిల్. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలోనూ రాణించి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'లు కైవసం చేసుకున్నాడు.
సచిన్ తెందూల్కర్...
భారత దిగ్గజం సచిన్ తెందూల్కర్ కెరీర్లో 463 వన్డేలు ఆడాడు. ఈ స్టార్ బ్యాట్స్‌మన్ ఎన్నో 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డులు ఖాతాలో వేసుకున్నాడు. అలాగే సేన దేశాల్లోనూ మాస్టర్ రాణించాడు.
ఇంగ్లాండ్‌పై 43.79 సగటుతో పరుగులు చేసిన మాస్టర్.. 26 మ్యాచ్‌ల్లో మూడుసార్లు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డులు అందుకున్నాడు. ఆస్ట్రేలియాపై 34.67 శాతంతో పరుగులు చేసిన సచిన్.. 3 అవార్డులు సొంతం చేసుకున్నాడు.
దక్షిణాఫ్రికాలో నాలుగు సార్లు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్న సచిన్.. అందులోని మూడింటిలో మూడు శతకాలు, ఒకదాన్లో 98 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌పైనా 22 గేమ్‌లు ఆడిన లిటిల్ మాస్టర్.. 3 ఎమ్ఓఎం అవార్డులు సొంతం చేసుకున్నాడు. కెరీర్లో మొత్తంలో 18, 426 రన్స్ చేసిన సచిన్ తెందూల్కర్.. వన్డేల్లో 49 శతకాలు సాధించాడు.