దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్, శ్రీలంక వరుస సిరీస్‌ల్లో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లు చూసి విసుగు చెందిన అభిమానులు.. అసలైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో సిరీస్ అనగానే ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఎన్నో అంచనాల మధ్య బరిలో దిగిన టీమిండియా .. ఆసీస్‌పై తొలి మ్యాచ్‌లోనే ఘోరాపరాభవం మూటగట్టుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో 0-1తేడాతో వెనుకంజలో ఉన్న భారత్.. రెండో వన్డేలోనైనా విజృంభించాలని భావిస్తోంది. రాజ్‌కోట్ వేదికగా ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

వెనుకడుగేసి.. ముందుకు దూకడం అలవాటే..
అవమానం మూటగట్టుకున్న వెంటనే ఆత్మపరిశీలన చేసుకోవడం టీమిండియాకు అలవాటే. స్వదేశంలో ఐదుసార్లు మూడు వన్డేల సిరీస్‌లో 0-1తో వెనుకంజలో ఉన్న సమయంలో.. భారత్ పుంజుకొని నాలుగు సిరీస్‌లు గెలిచింది. ఈ మధ్యే వెస్టిండీస్‌పై, 2017లో శ్రీలంక, న్యూజిలాండ్‌పై, 1981-82లో ఇంగ్లాండ్‌పై అలాగే విజయాలు అందుకుంది. ఈ వారసత్వం కోహ్లీసేనకు ఆత్మవిశ్వాసం అందించేదే.
కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు..
తొలి వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు జట్టుకు చేటు చేసిందనే చెప్పాలి. మూడో స్థానంలో ఆడుతున్న విరాట్ నాలుగులో బ్యాటింగ్‌కు రావడంపై పలువురు మాజీలు విమర్శించారు. అయితే నిలకడగా ఆడుతున్న కేఎల్ రాహుల్‌కు అవకాశం కల్పించాలనే సదుద్దేశంతోనే కోహ్లీ తన స్థానాన్ని త్యాగం చేశాడు. గబ్బర్ గాయం నుంచి కోలుకొని జట్టులోకి రావడం వల్ల ఈ తలనొప్పి మొదలైంది. అయితే వాంఖడేలో తన స్థానం మార్పు చేయడం విఫలమైన నేపథ్యంలో తర్వాత ఏం జరుగుతుందా అనే దానిపై ఆసక్తి నెలకొంది.

పంత్‌కు గాయం..
ఈ మ్యాచ్‌లో కోహ్లీ వన్‌డౌన్‌లో రావడం ఖాయంగా కనిపిస్తుండగా..... తొలి వన్డేలో 91 బంతుల్లో 74 పరుగులు చేసిన ఓపెనర్ శిఖర్ ధావన్, KL రాహుల్‌లో ఒకరిని నాలుగో స్థానంలో దింపే అవకాశం కనిపిస్తోంది. వికెట్ కీపర్ రిషభ్ పంత్ గాయంతో ఈ మ్యాచ్‌కు దూరమైనందున రాహుల్ కీపింగ్ చేయనున్నాడు. పంత్ స్థానంలో కేదార్ జాదవ్ లేదా శివమ్ దూబెను ఆడించే అవకాశం ఉంది.
తొలి వన్డేలో తేలిపోయిన పేసర్లు..
ఇటీవల కాలంలో బలమైన పేస్ దళంగా గుర్తింపు తెచ్చుకున్న మన పేసర్లు.. తొలి వన్డేలో తేలిపోయారు. షమి, బుమ్రా, శార్దుల్ సరైన లెంగ్త్‌ను అందిపుచ్చుకోలేక ఇబ్బందిపడ్డారు. ఈ లోపు ఆసీస్ ఓపెనర్లు కుదురుకొని క్రీజులో పాతుకుపోయారు. బౌలింగ్‌లో అంత ప్రభావం కనిపించకపోవడం, షార్ట్ పిచ్ బంతులను వార్నర్, ఫించ్ ఓ ఆటా డుకున్నారు. ఈ రోజు మ్యాచ్‌లో మహ్మద్ షమి, జస్‌ప్రీత్ బుమ్రా, శార్దుల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్‌ను కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.

ముంబయి వన్డేలో ఓటమికి పలు కారణాలు చెబుతుండగా రెండో వన్డేలో అలాంటి తప్పిదాలకు తావులేకుండా ముందుకెళ్లాలని భారత జట్టు భావిస్తోంది. రాజ్‌కోట్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశముంది. గతంలో ఇక్కడ జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ పరుగుల వరద పారి భారీస్కోర్లు నమోదయ్యాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ లక్ష్యాలను ఛేదించలేకపోయింది. మరోవైపు మొదటి మ్యాచ్‌లో అన్ని రంగాల్లో రాణించిన ఆసీస్.. రెండో వన్డేలో కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.
ఇదీ చదవండి: తల్లులైన న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ల జంట!