1983 Cricket World Cup : అదృష్టం కలిసొచ్చినందున 1983 ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలిచిందని.. ఆ జట్టులో ఏ ఒక్కరి ఆట కూడా తనను మెప్పించలేకపోయిందని వెస్టిండీస్ దిగ్గజ పేసర్ ఆండీ రాబర్ట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. విండీస్ తరపున తొలి రెండు ప్రపంచకప్ (1975, 1979)లు గెలిచిన రాబర్ట్స్.. 1983 ఫైనల్లో భారత్ చేతిలో ఓడిన జట్టులోనూ ఈయన ఉన్నారు. జూన్‌లో జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో పేలవ ప్రదర్శన చేసిన టీమ్ఇండియాను ఉద్దేశించి ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
1983 ప్రపంచ కప్‌లో, జింబాబ్వేతో పాటు వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో భారత్ సేన పోటీ పడింది. ఈ ఫార్మాట్ ప్రకారం లీగ్ దశలో అన్ని జట్లు ఒకదానితో ఒకటి రెండుసార్లు ఆడాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన విండీస్‌ను.. భారత జట్టు 34 పరుగుల తేడాతో ఓడించింది. ఆ తర్వాతి మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో ఓడిపోయినప్పటికీ, జింబాబ్వేను రెండుసార్లు, ఆస్ట్రేలియాను ఒకసారి ఓడించిన టీమ్ఇండియా సెమీస్‌కు చేరుకుంది. అక్కడ ఆతిథ్య ఇంగ్లాండ్‌ను ఓడించి కరేబియన్ దిగ్గజాలతో ఫైనల్‌కు సిద్ధమైంది.
ఆ తర్వాత లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్స్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. క్రిస్ శ్రీకాంత్‌తో అత్యధిక వ్యక్తిగత స్కోరు 38 పరుగులతో 183 రన్స్ చేసి.. మంచి ఆరంభాన్ని పొందింది. ఆ మ్యాచ్‌లో విండీస్‌ను 140 పరుగులకే ఆలౌట్ చేసింది. అప్పటి విండీస్ జట్టులో పేస్ దళానికి ఆండీ రాబర్ట్స్ నాయకత్వం వహించారు. దీంతో తాజాగా ఆయన ఈ ఘటనను గుర్తు చేసుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
"మా ఫామ్ అప్పుడు బాగుంది. కానీ ఓ పేలవ మ్యాచ్ వల్ల ఫైనల్లో ఓడిపోయాము. 1983లో భారత్‌కు అదృష్టం కలిసొచ్చింది. ఎందుకంటే అప్పుడు గొప్ప జట్టును కలిగి ఉన్న మేము.. ఆ ప్రపంచకప్‌లో రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిని చవి చూశాం. ఆ రెండు సార్లూ ప్రత్యర్థి జట్టు భారతే. కానీ అయిదారు నెలల తర్వాత 6-0తో టీమ్‌ఇండియాను ఓడించగలిగాం. ఆ ఫైనల్లో 183 పరుగులకే ఆలౌటైన తర్వాత భారత్‌ను అదృష్టం వరించింది. మేమేమీ చిత్తవలేదు. నాదేమీ అతి విశ్వాసం కూడా కాదు. బ్యాటర్లలో చూస్తే ఏ ఒక్కరి ఆట నన్ను అంతగా ఆకట్టుకోలేదు. బౌలర్లలో కనీసం ఒక్కరు కూడా 4 వికెట్లు పడగొట్టలేదు. వివ్ రిచర్డ్స్ ఔటైన తర్వాత మేం వేగాన్ని పుంజుకోలేకపోయాం" అని రాబర్ట్స్ తెలిపాడు.