Wrestlers Protest : ప్రతిష్టాత్మక ఐఓఏ అడ్‌హక్ కమిటీ.. ఆసియా క్రీడలు, ప్రపంచ ఛాంపియన్‌షిప్ కోసం రెజ్లింగ్ సెలక్షన్ నిర్వహించనుంది. అయితే ఇటీవల నిరసనలో పాల్గొన్న ఆరుగురు రెజ్లర్లు పోటీపడాల్సిన బౌట్లను ఒకటికి తగ్గించాలని ఆ కమిటీ ఓ నిర్ణయానికి వచ్చింది. దీని వల్ల రెండు ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్లలో పాల్గొని భారత జట్లలో చోటు దక్కించుకోవడానికి రెజ్లర్లు.. ట్రయల్స్ విజేతలతో పోటీపడితే సరిపోతుందని వారు పేర్కొన్నారు. బజ్‌రంగ్ పునియా, వినేశ్ ఫొగాట్, సంగీత ఫొగాట్, సాక్షి మలిక్, సత్యవర్త్ కడియన్, జితేందర్ కిన్హాలు ప్రాథమిక ట్రయల్స్ నుంచి మినహాయింపు పొందారు. గతంలో బజ్‌రంగ్, వినేశ్‌లకు ట్రయల్స్ నుంచి పూర్తి మినహాయింపు లభించేది. అయితే ఈ సారి మాత్రం సంగీత, సత్యవర్త్, జితేందర్‌లకు ఎప్పుడూ అలాంటి మినహాయింపు దక్కలేదు. అడ్‌హక్ కమిటీ జులై 15 లోపు ఆసియా క్రీడల ట్రయల్స్ పూర్తి చేసి జట్ల వివరాలను క్రీడల నిర్వాహకులకు పంపాల్సివుంది.
Asian Games 2023 : మరోవైపు ప్రాథమిక ట్రయల్స్ నిర్వహించడం ద్వారా ఐఓఏ.. గడువు లోపు ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ)కు రెజ్లర్ల పేర్లను పంపగలుగుతుంది. ప్రాథమిక ట్రయల్స్‌లో విజేతలను నిరసన చేస్తున్న రెజ్లర్లు ఓడించగలిగితే.. ఓసీఏకు పంపిన జాబితాలో కావాల్సిన మార్పులు చేసుకోవచ్చు. అయితే సెలక్షన్‌లో ఆ ఆరుగురికి మినహాయింపు ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
"భారత రెజ్లింగ్‌లో మార్పు కోసమంటూ వాళ్లు నిరసనకు దిగారు. కానీ మళ్లీ అవే పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. గతంలో కొందరు రెజ్లర్లకు అనుకూలంగా నిర్ణయాలు ఉండేవి. ఇంతకుముందు డబ్ల్యూఎఫ్‌ఐ, ఇప్పుడు అడ్‌హక్ కమిటీ కొందరు రెజ్లర్లకు ప్రయోజనం చేకూరుస్తున్నాయి" అని ఓ రెజ్లర్ తండ్రి వ్యాఖ్యానించారు. "మేం చేయగలిగేదేముంది? పోటీకి మేం సిద్ధమే. కానీ మా పిల్లలు పూర్తి డ్రాలో పోటీపడుతుంటే ఈ రెజ్లర్లు ఒక్క బౌట్లోనే పోటీపడటం అన్యాయం" అని ఆయన అన్నాడు. అయితే నిరసన చేసిన రెజ్లర్లు ఎప్పుడూ ట్రయల్స్ ద్వారా జట్టుకు ఎంపిక కావాలని కోరుకోలేదని, డబ్ల్యూఎఫ్‌ఐ వ్యవహారాలను నియంత్రించాలనుకున్నారని పాత సమాఖ్యలోని ఓ అధికారి వ్యాఖ్యానించాడు.
WFI Elections 2023 : మరోవైపు డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ కోసం మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని, అయితే ఈ ఎలక్షన్లలో బ్రిజ్ భూషణ్‌తో సంబంధం ఉన్న వాళ్లెవరూ ఈ పోటీల్లో నిలబడకుండా చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం తెలిపింది. ఈ బాధ్యతను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ)కి అప్పగించింది. ఈ క్రమంలో ఈ ఎన్నికలను ఈ నెలాఖరులోగా నిర్వహిస్తామని క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. కానీ కొన్ని విధానపరమైన పరిమితుల వల్ల అది జరగలేదు. అయితే జులై 6వ తేదీన ఎలక్షన్లు నిర్వహించాలని ఐఓఏ నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఓటర్ల లిస్టు తయారు చేసే పనిలో నిమగ్నమైంది. దీనికోసం 2022లో డబ్ల్యూఎఫ్ఐ డిస్‌క్వాలిఫై చేసిన ఐదు రాష్ట్రాల బోర్డుల సభ్యులతో సమావేశం నిర్వహించింది. అయితే ఈ మీటింగ్‌లో అనుకున్న ఫలితం రాలేదని తెలుస్తోంది.