పారిస్ వేదికగా జరుగుతున్న ఓర్లీన్స్ మాస్టర్స్‌లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ సెమీస్‌లోకి దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్‌లో అమెరికా ప్లేయర్ ఐరిస్ వాంగ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో 21-19, 17-21, 21-19తో గెలుపొందింది. గత రెండేళ్లుగా ఫామ్‌లేమితో తంటాలు పడుతున్న సైనా.. సెమీస్ చేరడం ఇదే తొలిసారి.
చివరిసారిగా 2019లో ఇండోనేసియా మాస్టర్స్ 500 టోర్నీలో సెమీస్‌కు చేరింది సైనా. తన తదుపరి మ్యాచ్‌లో డెన్మార్క్ షట్లర్ క్రిస్టోఫర్సన్తో లేదా స్వదేశానికి చెందిన ఇరా శర్మతో తలపడనుంది.
పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్.. ఇంటిముఖం పట్టాడు. క్వార్టర్స్‌లో ఫ్రాన్స్ ప్లేయర్ తోమ జూనియర్ పోపోవ్.. శ్రీకాంత్‌పై విజయం సాధించాడు. 41 నిమిషాల పాటు కొనసాగిన ఆటలో ప్రత్యర్థి 21-19, 21-17 తేడాతో విజయం సాధించాడు.
ప్రపంచ 8న సీడ్, భారత మహిళల డబుల్స్ జోడీ అశ్విని పొన్నప్ప-సిక్కి రెడ్డి.. ఇంగ్లాండ్‌కు చెందిన చోలే బిర్చ్-లారెన్ స్మిత్ జంటపై విజయం సాధించింది. 21-14, 21-18 తేడాతో గెలుపొందిందీ భారత ద్వయం. తదుపరి మ్యాచ్‌లో థాయ్‌లాండ్ జోడీ జోంగ్‌కోల్ఫాన్ కితితారకుల్-రవిందా ప్రజోంగ్ను ఎదుర్కోనుంది.
పురుషుల డబుల్స్ జోడీ క్రిష్ణ ప్రసాద్-విష్ణు వర్ధన్.. ఫ్రాన్స్ జంట క్రిస్టో పోపోవ్-తోమ జూనియర్ పోపోవ్ జంటపై విజయం సాధించింది. 21-17, 10-21, 22-20 తేడాతో గెలుపొందిన ఈ ద్వయం సెమీస్‌కు అర్హత సాధించింది. తర్వాతి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన కల్లమ్ హమ్మింగ్-స్టీవెన్ స్టాల్‌వుడ్ జంటతో ఆడనుంది.
ఇదీ చదవండి: 'పురుషుల బౌలింగ్ ఎదుర్కోవడం వల్లే బ్యాటింగ్ మెరుగు'