కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయిన బ్యాడ్మింటన్‌ను తిరిగి మొదలుపెట్టేందుకు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) చర్యలు మొదలుపెట్టింది. ఈ ఏడాది మార్చిలో ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్ తర్వాత అర్ధంతరంగా ఆగిపోయిన బ్యాడ్మింటన్‌ను అక్టోబరులో థామస్ అండ్ ఉబెర్ కప్ ఫైనల్‌తో ఆరంభించాలని నిర్ణయించింది. అక్టోబరు 3 నుంచి 11 వరకు డెన్మార్క్‌లో జరిగే ఈ టోర్నీ డ్రాను సోమవారం బీడబ్ల్యూఎఫ్ విడుదల చేసింది.
తొలుత మే 16 నుంచి 24 వరకు, తర్వాత ఆగస్టు 15 నుంచి 23 వరకు ఈ టోర్నీని నిర్వహించాలనుకున్నారు. కరోనా కారణంగా అదికాస్త వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు బీడబ్ల్యూఎఫ్, అక్టోబరులో ముహూర్తం ఖరారు చేసింది. టోర్నీలో భారత్‌కు సులువైన డ్రా ఎదురైంది. పురుషుల విభాగం (థామస్) గ్రూప్-సీ లో భారత్, డెన్మార్క్, అల్జీరియా ఉండగా.. మహిళల కేటగిరీ (ఉబెర్) గ్రూప్-డీ లో భారత్, చైనా, ఫ్రాన్స్, జర్మనీలకు చోటు దక్కింది. రెండు విభాగాల్లో భారత జట్లకు ఐదో సీడింగ్ లభించింది. ప్రతి గ్రూప్ నుంచి రెండేసి జట్లు నాకౌట్‌కు అర్హత సాధిస్తాయి.