కొరియా ఓపెన్ సింగిల్స్ విభాగంలో భారత షట్లర్లు సత్తాచాటలేకపోయారు. బుధవారం జరిగిన స్టార్ షట్లర్ పీవీ సింధు, పురుషుల్లో సాయి ప్రణీత్ తొలి రౌండ్లోనే ఓటమిపాలయ్యారు. ఇటీవలే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో విజయకేతనం ఎగురవేసిన సింధు గత వారం జరిగిన చైనా ఓపెన్‌లోనూ ఆకట్టుకోలేకపోయింది.
పుంజుకోవాలి సుమా...
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పసిడి గెలిచిన సింధుపై ఒలింపిక్స్ స్వర్ణం గెలుస్తుందని ఎన్నో ఆశలున్నాయి. విశ్వక్రీడలకు ముందే నిరూపించుకోవాల్సిన టోర్నీల్లో చతికిలపడుతోంది తెలుగమ్మాయి. స్వర్ణం గెలిచిన నెలలోనే రెండు వరుస టోర్నీల్లో పరాజయం చెందింది.
బుధవారం జరిగిన కొరియా ఓపెన్ తొలి రౌండ్ మ్యాచ్‌లో జాంగ్ బీవెన్(అమెరికా)ను తలపడింది. తొలి గేమ్‌లో సింధు 21-7తో ఆధిపత్యం కనబర్చినా... తర్వాతి రెండు సెట్లను 22-24, 15-21తో బీవెన్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ 56 నిముషాలపాటు జరిగింది. 2017లో సింధునే కొరియా ఓపెన్ టైటిల్ సొంతం చేసుకుంది.
ప్రణీత్ రిటైర్డ్ హర్ట్...
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన సాయి ప్రణీత్... ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్‌లో బరిలోకి దిగాడు. తొలి మ్యాచ్‌లో గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. 9-21, 7-11 తేడాతో ఐదో సీడ్ అండ్రెస్ అంటోన్సన్(డెన్మార్క్)చేతిలో ఓటమిపాలయ్యాడు ప్రణీత్.
ఇదీ చదవండి: పాక్ నుంచి క్షేమంగా రావాలని లంక ఆటగాళ్ల పూజలు