హాంకాంగ్ ఓపెన్‌లో భారత్ పతక ఆశలు గల్లంతయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో సెమీఫైనల్ చేరిన కిందాంబి శ్రీకాంత్... శనివారం ఇంటిముఖం పట్టాడు. తాజాగా జరిగిన సూపర్ 500 టోర్నీ సెమీస్ మ్యాచ్‌లో.. లీ చెక్ యూ(హాంకాంగ్)చేతిలో 15-20, 23-25 తేడాతో ఓడిపోయాడు శ్రీకాంత్. తనకన్నా తక్కువ ర్యాంకు ఆటగాడితో తలపడిన ఈ భారత షట్లర్.. 42 నిమిషాలు పోరాడాడు.
టోర్నీలో మెరుగ్గా...
ఈ టోర్నీలో ప్రపంచ ఛాంపియన్ కెంటో మొమొటా నుంచి బై అందుకున్న శ్రీకాంత్.. మూడో గేమ్‌లో భారత ఆటగాడు సౌరభ్ వర్మను ఓడించాడు. క్వార్టర్స్‌లో ఒలింపిక్ ఛాంపియన్ చెన్ లాంగ్ గాయం కారణంగా మ్యాచ్ మధ్యలో తప్పుకోవడం వల్ల శ్రీకాంత్ సెమీస్ చేరాడు. ఫలితంగా మార్చిలో ఇండియా ఓపెన్ తర్వాత తొలిసారి ఓ టోర్నీలో సెమీఫైనల్ చేరాడు.
ఈ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్లు తీవ్రంగా నిరాశపర్చారు. మహిళల సింగిల్స్‌లో సైనా, సింధు, పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్, సమీర్ వర్మ, పారుపల్లి కశ్యప్, సౌరభ్ వర్మ సత్తా చాటలేకపోయారు. టాప్ డబుల్స్ జోడీ, ప్రపంచ నెం.7 సాత్విక్-చిరాగ్ జోడీ కూడా తొలి రౌండ్లోనే ఓటమిపాలయ్యారు.