పుల్లెల గోపీచంద్.. బ్యాడ్మింటన్‌లో దేశానికి పేరు తెచ్చిన క్రీడాకారులను తీర్చిదిద్దిన ప్రముఖ శిక్షకుడు. సైనా నెహ్వాల్, సింధు, శ్రీకాంత్ లాంటి ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించే స్థాయికి వారిని తీర్చిదిద్దాడు. తాజాగా ఈటీవీ భారత్‌తో మాట్లాడిన గోపీచంద్ పలు విషయాలు వెల్లడించాడు.
కొంత కాలంగా ఫైనల్ మ్యాచ్‌ల్లో ఓడిపోతూ నిరాశపరుస్తోన్న సింధు మళ్లీ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు గోపీచంద్. క్వార్టర్ ఫైనల్, సెమీస్‌లో గట్టి పోటీ ఎదురయ్యే సరికి సింధు తుదిపోరులో శారీరకంగా అలసిపోతుందని తెలిపాడు. ఒత్తిడిని తట్టుకోలేక ఫైనల్లో ఓడిపోతోందని అన్నాడు. వీటన్నింటిని అధిగమించి భవిష్యత్తులో రాణిస్తుందని చెప్పాడు.
కిదాంబి శ్రీకాంత్ చాలా టోర్నీల్లో స్థిరత్వం లోపించి క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడని గోపీచంద్ తెలిపాడు. ప్రస్తుతం తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్న ఈ ఆటగాడు మరింతగా రాటుదేలాలని అన్నాడు. శ్రీకాంత్ శారీరకంగా మరింతగా శ్రమించాలని సూచించాడు.
భవిష్యత్తులో సైనా, సింధు కలిసి యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు గోపీచంద్.