భక్తిరస ధారావాహికలకు ఈటీవీ పెట్టింది పేరు. 'శ్రీ భాగవతం', 'మహా భారతం' వంటి పౌరాణిక సీరియల్స్ ఈటీవీలో ప్రసారం అయ్యి ఎంతో ప్రేక్షకాదరణ పొందాయి. ఇప్పుడు అదే కోవలో షిరిడీ సాయి జీవిత చరిత్ర ప్రసారం కానుంది. 'సద్గురు సాయి' పేరుతో సోమవారం(జులై 27) నుంచి ప్రతి రోజు సాయంత్రం 6.30 గంటలకు ప్రసారం చేయనున్నారు. ఈ ధారావాహిక హిందీలోని 'మేరె సాయి'కి అనువాదం. ఉత్తరాదిలో ఇది విశేష ఆదరణ పొందింది. దీనికి ముఖేష్ సింగ్ దర్శకత్వం వహించారు. సోని పిక్చర్స్ ఎంటర్టైన్‌మెంట్స్ సారథ్యంలో దశమి ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అంబీర్ సూఫీ సాయిబాబా పాత్రకు ప్రాణం పోశారు. చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ తోరల్ రాస్ పుత్ర, వైభవ్ మంగలేలు కీలక పాత్రలు పోషించారు. సంతోష్ అయాచిత్ కథ, స్క్రీన్‌ప్లే అందించగా సుబ్రత్ సిన్హా మాటలు రచించారు.
కథాంశం ఏమిటంటే...
బాబా మొదటిసారి షిరిడీకి ఎందుకు వచ్చారు? అక్కడే ఎందుకు నివాసం ఏర్పరచుకున్నారు? భక్తులు ఆయనను ఎలా అనుసరించేవారు? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ సీరియల్ తెరకెక్కింది. బాబా తీసుకునే నిర్ణయాలు, వాటి వెనక తత్వాలు వివరించే సన్నివేశాలను దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. ఈ సీరియల్‌లో సాయి బాబా లీలలు, చావిడి, లేండీ వనం, బాబా నివసించిన మసీదు అన్ని కళ్లకు కట్టినట్టు చిత్రీకరించడం విశేషం.