ఆకట్టుకునే అందం, అలరించే అభినయంతో బాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకుల అభిమానం చూరగొంటున్న ముద్దుగుమ్మ రుబీనా దిలాయిక్. ఇటీవల హిందీలో ముగిసిన బిగ్‌బాస్-14 సీజన్‌లోనూ విజేతగా నిలిచింది. తద్వారా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పటి నుంచి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ... తాజాగా డిప్రెషన్‌తో తనకెలాంటి గడ్డు పరిస్థితులెదురయ్యాయో అందరితో పంచుకుంది.
బిగ్‌బాస్ విజేతగా నిలిచి!
సిమ్లాలో పుట్టి పెరిగిన రుబీనా మొదట ఐఏఎస్ కావాలనుకుంది. ఇందులో భాగంగానే సివిల్స్ పరీక్షలకు కూడా సన్నద్ధమైంది. అయితే అదే సమయంలో ‘ఛోటీ బహూ’ సీరియల్ ఆడిషన్స్ జరగడం, అందులో రుబీనా పాల్గొనడం, ఎంపిక కావడం చకచకా జరిగిపోయాయి. ఇక ఈ సీరియల్ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ‘ఛోటీ బహూ’ సీరియల్ సీక్వెల్‌తో పాటు ‘సాస్ బినా ససురాల్’, ‘పునర్వివాహ్-ఏక్ నయీ ఉమీద్’, ‘శక్తి-అస్తిత్వ కే ఎహ్సాస్ కీ’, ‘జీనీ ఔర్ జూజూ’.. వంటి ధారావాహికలతో పాటు బిగ్‌బాస్ వంటి రియాలిటీషోలతో బాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఇక ఇటీవల ముగిసిన బిగ్‌బాస్-14 సీజన్‌తో తన క్రేజ్‌ను మరింత పెంచుకుందీ అందాల తార. ప్రపంచంతో సంబంధం లేకుండా మొత్తం 143 రోజుల పాటు బిగ్‌బాస్ హౌస్‌లో గడిపిన ఆమె విజేతగా నిలిచి ట్రోఫీతో పాటు రూ.36 లక్షల నగదు బహుమతిని సొంతం చేసుకుంది.
ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను!
ప్రస్తుతం బిగ్‌బాస్ విజయాన్ని మనసారా ఆస్వాదిస్తోంది రుబీనా. అయితే ఈ సంతోషకరమైన జీవితం వెనక ఎవరికీ కనిపించని కన్నీళ్లు కూడా ఉన్నాయంటోంది 'ఛోటీ బహూ'. డిప్రెషన్ కారణంగా గతంలో తాను గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నానంటోంది. ‘తొమ్మిదేళ్ల క్రితం నేను మానసిక కుంగుబాటుకు గురయ్యాను. ఆ సమయంలో నిలకడలేని ఆలోచనలు, అభద్రతాభావం నన్ను బాగా వేధించాయి. విపరీతమైన పని ఒత్తిడితో వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోలేకపోయాను. కుటుంబానికి దూరంగా ఉండటం, పని ఒత్తిడితో స్నేహితులతో కలిసే సమయం లేకపోవడంతో ఒంటరిదాన్నైపోయాననిపించింది. చిన్న చిన్న విషయాలకు ఎందుకు చిరాకు పడుతున్నాను? ఎందుకు నా చుట్టూ ఎవరూ లేరు? నేనెందుకు లైఫ్‌లో సక్సెస్ కాలేకపోతున్నాను? వంటి సమాధానం లేని ఎన్నో ప్రశ్నలు నన్ను చాలాకాలం పాటు వెంటాడి వేధించాయి. దురదృష్టవశాత్తూ ఆ సమయంలో నాకు మార్గనిర్దేశం చేసి ముందుకు నడిపించడానికి ఎవరూ తోడు లేరు. ఒకానొక సమయంలో ఆత్మహత్య ఆలోచనలు కూడా నా మదిలో మెదిలాయి. అయితే క్రమంగా నన్ను నేను వెతుక్కోవడం ప్రారంభించాను. నా సమస్యలకు మూలాలను వెతకడం ప్రారంభించాను. జీవితంలో నేను తెలుసుకోవాల్సిన, అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని గ్రహించాను.’
యోగా, మెడిటేషన్‌తో బయటపడ్డాను!
‘డిప్రెషన్ బారిన పడిన వారు తమ సమస్య గురించి ఎవరితోనూ చెప్పాలనుకోరు. నేను కూడా చాలా రోజుల పాటు ఒంటరిగానే ఈ సమస్యతో పోరాటం చేశాను. సైకాలజిస్టుల దగ్గరకు కూడా వెళ్లలేకపోయాను. డిప్రెషన్ గురించి మన సమాజంలో ఉన్న కొన్ని అపోహలు, అనుమానాలే ఇందుకు కారణం. అయితే ఇలాంటి ఆలోచనలు, విధానాల్లో మార్పు రావాలి. డిప్రెషన్ సమస్యపై అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇక నేను డిప్రెషన్ నుంచి బయటపడడానికి యోగా, మెడిటేషన్ బాగా సహకరించాయి. మనసుకు సాంత్వన కలిగించే పుస్తకాలను ఎక్కువగా చదివాను. ఆన్‌లైన్‌లో మానసిక నిపుణుల ఆడియో టేపులు విన్నాను. అలా క్రమక్రమంగా సాధారణ జీవితంలోకి వచ్చేశాను’ అంటూ తన అనుభవాలను గుదిగుచ్చిందీ బిగ్‌బాస్ బ్యూటీ.
ఇదీ చదవండి: పది రూపాయలకే కడుపునిండా భోజనం...!